ఫౌజీ ప్రమాదం.. సీఎం కి AICWA విజ్ఞప్తి!
AICWA has urged Telangana Chief Minister Revanth Reddy
హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న ప్రభాస్ `ఫౌజీ` చిత్ర షూటింగ్‌లో విష కీటకం కాటుకు గురై, సీనియర్ నటుడు రాజేష్ శర్మ ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లడం సినీ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. షూటింగ్ స్పాట్‌లోనే ఆయనకు తీవ్ర జ్వరం, శ్వాసకోస ఇబ్బందులు తలెత్తినప్పటికీ స్థానికంగా చికిత్స అందించకుండా నేరుగా కోల్‌కతా ఆసుపత్రికి తరలించడంపై బాలీవుడ్ ఫెడరేషన్ అనుమానాలు వ్యక్తం చేసింది. ప్రస్తుతం బెంగాల్‌లోని ఢాకూరియా ప్రైవేట్ ఆసుపత్రిలో ఐసీయూలో చావుబతుకుల మధ్య పోరాడుతున్న రాజేష్ శర్మ ఆరోగ్యంపై నటి సుదీప ఛటర్జీ ఆందోళన వ్యక్తం చేయడంతో ఈ దారుణ సంఘటన వెలుగుచూసింది.
ఈ తీవ్రమైన నిర్లక్ష్యంపై `ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్` (AICWA) ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఘటనా స్థలంలో భద్రతా లోపాలపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలని అధికారికంగా విజ్ఞప్తి చేసింది.
కోట్లాది రూపాయల బడ్జెట్‌తో సినిమాలు తీస్తున్న నిర్మాణ సంస్థలు, కనీస అత్యవసర వైద్య సదుపాయాలు - పరిశుభ్రత ప్రోటోకాల్స్‌ను గాలికొదిలేస్తున్నాయని, ఇలాంటి ప్రాణాంతక సంఘటనలు జరిగినప్పుడు ఉపాధి కోల్పోతామనే భయంతో టెక్నీషియన్లు నిజాలు దాస్తున్నారని అసోసియేషన్ ఆరోపించింది. `ఖోస్లా కా ఘోస్లా`, `ఎమ్.ఎస్. ధోని` వంటి చిత్రాలతో శర్మ ఫేమస్ అయ్యారు. అతడి వైద్య ఖర్చులన్నీ నిర్మాతలే భరించాలని, ప్రాణాల కంటే ప్రాజెక్టులు ముఖ్యం కాదంటూ ఏఐసీడబ్ల్యూఏ హెచ్చరించింది.







































