చిక్కుముడి విప్పేందుకు ఢిల్లీ బాటపట్టిన దళపతి!

CM Vijay

దళపతి విజయ్ చివరి చిత్రంగా కోలీవుడ్‌లో అత్యంత భారీ అంచనాలతో తెరకెక్కిన `జననాయగన్`  సినిమా విడుదల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గత జనవరిలోనే సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రావాల్సి ఉన్నప్పటికీ కథలోని రాజకీయ ప్రాధాన్యత ఉన్న డైలాగులు, కొన్ని పవర్‌ఫుల్ సన్నివేశాలపై సెన్సార్ బోర్డు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో గత కొన్ని నెలలుగా సెన్సార్ ఇబ్బందుల్లో చిక్కుకుంది.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి  పీఠాన్ని అధిరోహించడంతో  సినిమా అడ్డంకులన్నీ తొలగిపోయి సులువుగా విడుదలవుతుందని అందరూ భావించారు. కానీ ప్రాంతీయ సెన్సార్ బోర్డ్ నుంచి క్లియరెన్స్ రాకపోవడంతో   ప్రాజెక్ట్ చుట్టూ ఉన్న రిలీజ్ సస్పెన్స్ అలాగే కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ వివాదం ప్రాంతీయ బోర్డు పరిధి దాటి ఢిల్లీలోని కేంద్ర సెన్సార్ బోర్డు ఉన్నత స్థాయి పునసమీక్షా కమిటీ వద్దకు చేరింది.

సినిమాను ఎట్టిపరిస్థితుల్లోనూ జూన్ ఆఖరి వారంలో థియేటర్లలోకి తీసుకురావాలనే పట్టుదలతో ఉన్న విజయ్ సెన్సార్ చిక్కుముడిని విప్పడానికి స్వయంగా రంగంలోకి దిగి దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లిన‌ట్లు తెలుస్తోంది.రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్న అగ్ర నటుడు  సినిమా సెన్సార్ క్లియరెన్స్ కోసం స్వయంగా ఢిల్లీ వెళ్లడం  దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. మరి ఢిల్లీ వేదికగా సాగే కీలక చర్చలతోనైనా జననాయగన్ వివాదం ముగిసి అధికారిక విడుదల తేదీ ఖరారవుతుందో? లేదో? చూడాలి.

Jana Nayagan update