60 ఏళ్ల వయసులో నటి ఫేస్‌బుక్ ప్రేమ!
Suhasini Mulay reveals why she married for the first time at 60ఆమీర్ ఖాన్ క్లాసిక్ చిత్రం `లగాన్` లో ఆయనకు తల్లిగా నటించి గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటి, జాతీయ అవార్డు గ్రహీత సుహాసిని ములే తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ స్ఫూర్తిదాయకమైన కథను పంచుకున్నారు. సమాజంలో వివాహానికి వయసుతో సంబంధం లేదని నిరూపిస్తూ తన 60వ ఏట మొదటిసారిగా పెళ్లి పీటలెక్కారు.
జీవితంలో సరైన భాగస్వామి దొరకకపోవడం వల్లే అంతకాలం ఒంటరిగా ఉన్నానని తెలిపిన ములే ఒక స్నేహితురాలి సలహా మేరకు వృత్తిపరమైన సినిమా అవకాశాల కోసం ఫేస్‌బుక్‌లో చేరారు. ఆ సమయంలో ప్రముఖ శాస్త్రవేత్త అతుల్ గుర్తూ ప్రొఫైల్ ఆమె దృష్టిని ఆకర్షించింది. ఆయన లార్జ్ హాడ్రాన్ కొలైడర్ అనే ప్రపంచ ప్రసిద్ధ సైన్స్ ప్రాజెక్టుపై పని చేస్తున్నారని తెలుసుకుని.. సైన్స్ పట్ల ఉన్న ఆసక్తితో LHC అంటే ఏంటి? అని అడుగుతూ ఆమె ఆయనకు తొలి సందేశం పంపారు.
ఆ ఆన్‌లైన్ పరిచయం కాస్తా ఈమెయిల్ సంభాషణలుగా మారింది. అతుల్ తాను ఒక జీవిత భాగస్వామి కోసం వెతుకుతున్నట్లు సుహాసినికి వెల్లడించారు. సోషల్ మీడియా పరిచయం కావడంతో మొదట్లో కొంత అప్రమత్తంగా వ్యవహరించి ఆయన పనిచేసే సంస్థ అధికారిక వెబ్‌సైట్‌లో వివరాలను, ఫోటోను సరిచూసుకున్న తర్వాతే తన ఫోన్ నెంబర్ పంచుకున్నారు. నవంబర్ నెలాఖరులో ఇద్దరు మొదటిసారి ప్రత్యక్షంగా కలుసుకుని.. ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్నారు. అనంతరం ఏడు రోజుల్లోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అలా పరిచయమైన 75 రోజుల్లోనే వివాహం జరిగింది.






































