స్పైడర్-మ్యాన్ 4 సెన్సార్ వివాదం!

Spider-Man 4 Censor Controversy!

హాలీవుడ్ స్టార్ టామ్ హాలండ్ కథానాయకుడిగా  తెర‌కెక్కుతోన్న‌  మోస్ట్ అవేటెడ్ మూవీ `స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే`. ఈ సినిమా  అప్‌డేట్స్ కోసం ప్రపంచవ్యాప్తంగా మార్వెల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ చిత్రం విడుదలకు ముందే  రన్‌టైమ్ ..భారతీయ సెన్సార్ బోర్డు  విధించిన కట్స్ గురించి సామాజిక మాధ్యమాల్లో రకరకాల పుకార్లు  చక్కర్లు కొడుతున్నాయి.

ఈ చిత్రం సుదీర్ఘమైన నిడివితో రానుందని.. భారత సెన్సార్ బోర్డు కొన్ని కీలక సన్నివేశాలపై కత్తెర వేసిందంటూ నెట్టింట ప్రచారం సాగింది. తాజాగా ఈ ఊహాగానాలపై సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండియా స్పందించింది. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న రన్‌టైమ్ నివేదికలు ..సెన్సార్ కట్స్ గురించిన‌ వార్తలు అవాస్తవమని తేల్చి చెప్పింది.

ఈ చిత్రానికి సంబంధించి సెన్సార్ బోర్డు నుండి ఎలాంటి అధికారిక కట్స్ జరగలేదని ప్రచారంలో ఉన్న సమాచారం అంతా కల్పితమని మేకర్స్ స్పష్టం చేశారు. హాలీవుడ్ భారీ చిత్రాల పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుది దశకు వచ్చే వరకు వాటి ఖచ్చితమైన నిడివిని నిర్ణయించడం సాధ్యం కాదని.. అందువల్ల అభిమానులు ఇలాంటి అనధికారిక వార్తలను నమ్మవద్దని సోనీ పిక్చర్స్ ప్రతినిధులు సూచించారు.

టామ్ హాలండ్ సరికొత్త లుక్‌లో అలరించబోతున్న ఈ యాక్షన్ అడ్వెంచర్‌కు సంబంధించిన అసలైన రన్‌టైమ్ - సెన్సార్ వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తామని ప్రకటించడంతో  వివాదానికి తాత్కాలికంగా తెరపడింది.

Spider-Man - Brand New Day runtime controversy