చిత్ర పరిశ్రమకు కమల్‌హాసన్ హెచ్చరిక!

పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు భారతీయ చలనచిత్ర పరిశ్రమపై తీవ్ర ఆర్థిక ప్రభావాన్ని చూపుతాయని అగ్ర నటుడు, దర్శకుడు కమల్ హాసన్ ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధ వాతావరణం కారణంగా ముడి చమురు ధరలు పెరగడం వల్ల రవాణా ఖర్చులు భారమై, పరోక్షంగా సెట్ల నిర్మాణం, విదేశీ షూటింగ్‌లు.. రోజువారీ ఉత్పత్తి వ్యయం అమాంతం పెరుగుతాయని ఆయన విశ్లేషించారు.
ప్రపంచవ్యాప్తంగా మారుతున్న ఈ భౌగోళిక రాజకీయ పరిస్థితులు కేవలం వినోద రంగాన్నే కాకుండా.. దానిపై ఆధారపడిన వేలాది మంది కార్మికులు, సాంకేతిక నిపుణుల ఉపాధిని కూడా దెబ్బతీసే ప్రమాదం ఉందని ఆయన ఒక బహిరంగ లేఖ ద్వారా హెచ్చరించారు.
ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి చిత్ర పరిశ్రమలోని నిర్మాతలు, వాటాదారులు అంతా ఒక్కతాటిపైకి రావాలని కమల్ పిలుపునిచ్చారు. పెరిగిన నిర్మాణ వ్యయం వల్ల ముఖ్యంగా చిన్న, మధ్యతరహా చిత్రాల నిర్మాతలు కుదేలయ్యే అవకాశం ఉన్నందున తక్షణమే పరిశ్రమ వ్యాప్తంగా ఒక అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి బడ్జెట్ నియంత్రణపై చర్చించాలని ఆయన ప్రతిపాదించారు.
సమస్య ముదిరే వరకు వేచి చూడకుండా.. భవిష్యత్తులో తలెత్తే ఇటువంటి అనిశ్చితిని తట్టుకోవడానికి ముందస్తు ప్రణాళికలు - సమిష్టి వ్యూహాలు అవసరమని ఆయన నొక్కి చెప్పారు.






































