ఈ రేంజులో రెచ్చిపోవాలా?
A new trend in photo shoot!ఇటీవలి కాలంలో మన కథానాయికల ఫోటోషూట్ల తీరుతెన్నులు టూమచ్‌గా మారాయి! మర్లిన్ మన్రో, ఎలిజబెత్ టేలర్, మడోన్నా, బ్రిట్నీలనే మించిపోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే హాలీవుడ్ హీరోయిన్లు, పాప్ బ్యూటీలనే తలదన్నే టీజింగ్ కిల్లర్ లుక్స్ తో మతులు చెడగొడుతున్నారు. టీనేజ్ కుర్రకారు నుంచి వృద్ధాగ్రేసరుల వరకూ (6 నుంచి 60 వరకూ ఎవరైనా) ఫ్లిప్ మోడ్ లో కళ్లప్పగించాల్సిందే. ఆ రేంజులో చెలరేగిపోవడం లేదా దుందుడుకు చూపించడం అనేది నేటి ట్రెండ్ గా మారింది. నిజానికి ఇది ఒకప్పుడు లేదు. చూస్తుండగానే కళ్ల ముందే ఈ ఐదేళ్లలోనే ఇంత మార్పు. ఒక తెలుగమ్మాయి ఈ రేంజులో రెచ్చిపోయి ఆరబోయడం అన్నది కూడా మునుపెన్నడూ చూడనిది. ముంబై, బెంగళూరు, కలకత్తా, పూణే, దిల్లీ వంటి మెట్రో నగరాల్లో సైతం ఇంతగా ఆరబోయరేమో! అనేంతగా మనవాళ్లు కూడా చెలరేగిపోతున్నారు. ర్యాంప్ కల్చర్ లేదా ఫ్యాషన్ ఇండస్ట్రీ కల్చర్ కి ఇప్పుడు హైదరాబాద్ మెట్రో ఏమాత్రం తీసిపోవడం లేదనే సంకేతాలు యువతరంలోకి వెళ్లాయి.
గడిచిన ఐదేళ్లలో కథానాయికల ఫోటోషూట్ల తీరుతెన్నులు పరిశీలిస్తే.. ముఖ్యంగా తెలుగు హీరోయిన్ ల ఫోటోషూట్ల వ్యవహారం హద్దు మీరుతోందా? సరిహద్దు రేఖల్ని దాటుతోందా? అనేంతగా క్రియేటివ్ కర్వీ ఎలివేషన్లు నిజానికి మన సంస్కృతిని చాలా దూరం తీసుకెళుతున్నాయని విశ్లేషిస్తున్నారు. ఒళ్లు విరుచుకుంటూ, బికినీలు మోనోకిల్లో బీచ్ పరిసరాల్లో హొయలు పోతూ, ముళ్ల కంచెకు చిక్కుకున్న పవిట కొంగును సరి చేసుకుంటూనో.. పిక్కలపైకి మిడ్డీలు ధరించి.. లేదా డెనిమ్ జీన్స్ బటన్ విప్పుతూ.. సీకే బ్రాండ్ లోదుస్తులను ఇష్టానుసారం అందాలను ఓపెన్ గా ప్రదర్శిస్తూ.. అసలు ఈ మార్కెట్ మాయాజాలం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
అయితే ఈ రేంజులో అందాల ఆరబోతతో యువతరాన్ని ఆకర్షించాలనే కార్పొరెట్ ఎత్తుగడ పర్యవసానమా? లేక తమ మనుగడకు లేదా ఉపాధికి డోఖా లేకుండా చూసుకోవాలనే ఆత్రమా? సోషల్ మీడియా క్లిక్ బైట్ సంస్కృతిలో భాగమా? అక్కడ ప్రకటనల ఆదాయం కోసమా? ఓవరాల్ గా నేటి సమాజం ఎటుపోతోంది? నేటితరం యువతి ఏ దిశగా ప్రయాణిస్తోంది? అనే సందేహాలు కలుగుతున్నాయి. గ్లామర్ ఇండస్ట్రీలో రాణించాలంటే గ్లామర్ ఎలివేషన్ తప్పనిసరి. కానీ అది హద్దు మీరేంతగా దూసుకెళుతుంటే దీనిని ఆపేదే లేదా? దీనికి పరిష్కారమే లేదా? పెద్ద తెరపై అసభ్యత విషయంలో సెన్సార్ సభ్యులు లేదా సీబిఎఫ్ సి బృందాలు కత్తెర వేస్తున్నా, ఫోటోషూట్లు, వీడియో షూట్లకు కత్తెర వేసే ఛాన్సే కనిపించడం లేదు. డిజిటల్ మాధ్యమాలు, యూట్యూబ్ లో రెచ్చిపోయే ఫోటోషూట్లు, డీగ్రేడ్ ఎలివేషన్లను ప్రశ్నంచే నాథుడే లేడు. అయితే కొంతలో కొంత ఇటీవలి కాలంలో అసభ్యకర కంటెంట్ విషయంలో యూట్యూబ్ మాధ్యమ కొత్త నియమనిబంధనలు కొంతవరకూ ఆపగలవేమో కానీ.. ఇది సాధారణ సమాజం అడ్డుకునే పరిస్థితి అయితే కనిపించడం లేదనే విశ్లేషణ సాగుతోంది.
స్త్రీ స్వేచ్ఛ- స్వాతంత్య్రం అంటే ఇదేనా? యథేచ్ఛగా ఉండటం అంటే ఇంతేనా? భారతదేశ భవిష్యత్ పాశ్చిత్య విశృంఖలత ఒడిలోకి జారిపోయినట్టేనా? అంటూ సాంప్రదాయ వాదులు కూనిరాగాలు తీస్తున్నారు. అయితే ఎవరు ఎలాంటి పద్యాలు పాడినా నేటి యువతి భవితను నిర్ధేశించలేరు. ఎవరికి వారే ఈ గ్లామర్ రంగంలో దూసుకువెళ్లాల్సిన పరిస్థితి సవాళ్లు ఇక్కడ ఉన్నాయి. సంధ్యా ఉదయం నుంచి సూర్యాస్తమయం సమయానికి చేతికి చిక్కాల్సింది చిక్కకపోతే మనుగడే లేదు! ఇక్కడ గాడ్ ఫాదర్ లేకుండానే ఎదగాలంటే అందుకు గ్లామర్ నే నమ్ముకోవాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయని విశ్లేషిస్తున్నారు.







































