జ‌ర్న‌లిస్ట్ ప్ర‌శ్న‌కు ఎగ్జిబిట‌ర్ షాకింగ్ ఆన్స‌ర్

టాలీవుడ్ లో సింగిల్ స్క్రీన్ల క్రైసిస్ గురించి.. ప‌ర్సంటేజీ షేరింగ్ విధానం గురించి సీరియ‌స్ గా డిబేట్లు న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. టికెట్ ల ఆదాయం నుంచి పర్సంటేజ్ షేర్ అడుగుతున్న ఎగ్జిబిటర్లు.. థియేటర్లలో లభించే ఫుడ్ & బెవరేజెస్ (క్యాంటీన్), పార్కింగ్ ఫీజుల ఆదాయాన్ని నిర్మాతలతో షేర్ చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారా? అనే ప్రశ్న జ‌ర్న‌లిస్ట్ నుంచి ఎగ్జిబిట‌ర్ నారంగ్ కి ఎదురైంది.

ఈ క్లిష్ఠ‌మైన‌ ప్ర‌శ్న‌కు ఏషియ‌న్ సునీల్ నారంగ్ తాజా ఇంట‌ర్వ్యూలో స‌మాధాన‌మిచ్చారు. ప్రస్తుతం టికెట్ కలెక్షన్ల ద్వారా వచ్చే ఆదాయం థియేటర్ల మనుగడకు సరిపోవడం లేదని, కేవలం క్యాంటీన్, పార్కింగ్ వల్లే సింగిల్ స్క్రీన్స్ నెట్టుకొస్తున్నాయని తేల్చి చెప్పారు. వ్యాపార పరంగా చూస్తే, టికెట్ కలెక్షన్ల షేరింగ్ అనేది సినిమా కంటెంట్‌కు సంబంధించి ఉంటుందని, అయితే పార్కింగ్, క్యాంటీన్ (ఎఫ్ అండ్ బీ) అనేవి థియేటర్ యాజమాన్యం తమ సొంత పెట్టుబడితో కల్పించే ఇన్ ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ (వ‌స‌తులు) అని వివరించారు. కాబట్టి ఈ రెండింటినీ ముడిపెట్టి ఆ ఆదాయాన్ని షేర్ చేయడం అసాధ్యమని కుండబద్దలు కొట్టారు.

ఒకవేళ నిర్మాతలు క్యాంటీన్ ఆదాయంలో వాటా అడిగితే, మరి థియేటర్ల డిజిటల్ ప్రొజెక్షన్ కోసం ఎగ్జిబిటర్లు భరిస్తున్న వర్చువల్ ప్రింట్ ఫీజు (వీపీఎఫ్) చార్జీలను.. రోజువారీ మెయింటెనెన్స్ ఖర్చులను నిర్మాతలు పంచుకుంటారా అని ప్రశ్నిస్తూ.. ఈ సమస్యలన్నింటినీ ఫిలిం ఛాంబర్ వేదికగా సుహృద్భావ వాతావరణంలో చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు.

Suniel Narang ,Producer Suniel Narang