విభేదాలు వీడి ఒక్కటైన రణవీర్ సింగ్ - ఆదిత్య!

ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ కెరీర్‌లోనే అత్యంత అద్భుతమైన ఫేజ్‌ను ఆస్వాదిస్తున్నారు. నాలుగు నెలల వ్యవధిలోనే బ్యాక్-టు-బ్యాక్ రెండు భారీ ఇండస్ట్రీ హిట్లను ఖాతాలో వేసుకుని బాక్సాఫీస్ రాజుగా నిలిచారు. ముఖ్యంగా ఆయన నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ `ధురందర్` ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల సునామీ సృష్టిస్తూ సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ భారీ సక్సెస్ జోష్‌లో ఉన్న రణవీర్ సింగ్ తాజాగా తనను వెండితెరకు పరిచయం చేసిన గురువు, యష్ రాజ్ ఫిల్మ్స్ అధినేత ఆదిత్య చోప్రాతో భేటీ కావడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
గత కొంతకాలంగా రణవీర్ సింగ్, ఆదిత్య చోప్రా మధ్య మనస్పర్థలు, విభేదాలు ఉన్నట్లు బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరిగింది. అయితే రణవీర్‌ను హీరోగా లాంచ్ చేసి ఆయన విజయానికి బలమైన పునాది వేసింది తానే కావడంతో `ధురందర్` సాధించిన అసాధారణ విజయం ఆదిత్య చోప్రాకు ఎంతగానో నచ్చింది. ఈ నేపథ్యంలోనే వైఆర్ఎఫ్ స్టూడియోలో వీరిద్దరి మధ్య రహస్యంగా మూసేసిన తలుపుల వెనుక సుదీర్ఘమైన సమావేశం జరిగింది. ఈ క్రేజీ మీటింగ్‌లో ఒకరినొకరు కౌగిలించుకుని తమ మధ్య ఉన్న పాత విభేదాలన్నింటినీ పూర్తిగా పక్కన పెట్టేసి ఇద్దరూ ఒక్కటయ్యారు.
ఈ సుదీర్ఘ సమావేశంలో వారిద్దరి భవిష్యత్తు ప్రణాళికలు `ధురందర్` సక్సెస్ సెలబ్రేషన్స్‌తో పాటు మళ్లీ కలిసి పనిచేసే అంశంపై కూడా లోతుగా చర్చలు జరిగాయి. ఒక భారీ స్థాయి ఫీచర్ ఫిల్మ్ కోసం రణవీర్- ఆదిత్య చోప్రా ఇద్దరూ ఎంతో ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. రాబోయే ఆరు నెలల్లో అద్భుతమైన కథతో రణవీర్ ముందుకు వస్తానని ఆదిత్య చోప్రా ప్రామిస్ చేయగా రణవీర్ కూడా ఈ ప్రాజెక్ట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. రణవీర్ సింగ్ తిరిగి సొంత బ్యానర్ అయిన వైఆర్ఎఫ్ లోకి అడుగుపెట్టడం ఆయన అభిమానులకు హోమ్‌కమింగ్ లాంటి అనుభూతిని ఇస్తోంది.






































