ఎదుగుతుంటే కిందకు లాగడం ఇండియన్స్ కి అలవాటే!

ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2026 రెడ్ కార్పెట్‌పై బాలీవుడ్ స్టార్ నటి ఆలియా భట్ తన సరికొత్త లుక్స్‌తో సందడి చేసిన సంగతి తెలిసిందే. అయితే సోషల్ మీడియా వేదికగా కొందరు నెటిజన్లు అలియా లుక్స్ , కాస్ట్యూ మ్స్‌ను విమర్శిస్తూ బాడీ షేమింగ్ చేస్తూ దారుణంగా ట్రోల్ చేశారు. ఈ పరిణామంపై బాలీవుడ్ సీనియర్ నటి అమీషా పటేల్ తీవ్రంగా స్పందించారు. అంతర్జాతీయ వేదికపై దేశం గర్వపడేలా ప్రాతినిధ్యం వహిస్తున్న తోటి నటిని ఇలా అకారణంగా లక్ష్యంగా చేసుకోవడం అత్యంత విచారకరమన్నారు.
ఈ విధమైన సైబర్ బుల్లీయింగ్‌ను తానేమాత్రం సహించనని ఘాటుగా వ్యాఖ్యానించారు. ట్రోలర్ల తీరును తప్పుబడుతూ అమీషా పటేల్ మన సమాజంలోని ఆలోచనా విధానాన్ని ఎండగట్టారు. `ప్రస్తుతం మన భారతీయుల మానసిక పరిస్థితి ఎలా తయారైందంటే? పక్కన ఉన్నవారు ఎవరైనా కష్టపడి పైకి ఎదుగుతున్నా? అంతర్జాతీయంగా ఎదుగుతున్నా? వారిని చూసి గర్వపడాల్సింది పోయి ఎలాగైనా కిందకు లాగాలి అనే నీచమైన స్వభావం ఎక్కువైపోయింది` అని ఆవేదన వ్యక్తం చేశారు.
దేశ ప్రతిష్టను ప్రపంచ దేశాల ముందు నిలబెట్టే సెలబ్రిటీలకు అండగా నిలవాల్సింది పోయి ఇలాంటి నెగటివిటీని వ్యాప్తి చేయడం వల్ల మన సంస్కారమే ప్రశ్నార్థకంగా మారుతుందని అమీషా హెచ్చరించారు. ఆలియా భట్‌కు మద్దతుగా అమీషా పటేల్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట పెద్ద చర్చకు దారితీశాయి. విమర్శల కోసమే కాకుండా? అంతర్జాతీయ స్థాయి గుర్తింపు సాధించిన నటీనటుల ప్రతిభను , శ్రమను గౌరవించే వాతావరణం మన ప్రేక్షకుల్లో ...ముఖ్యంగా ట్రోలర్లలో మారాల్సిన అవసరం ఎంతైనా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.






































