ఇండియా గెలవాలంటే మరింత ఇండియన్‌గా మారాలి

హాలీవుడ్‌లో `డ్రెడ్`, `కాసిల్‌వేనియా` వంటి పాపులర్ చిత్రాలతో అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ మేకర్ ఆది శంకర్ గ్లోబల్ మార్కెట్‌లో భారతీయ సినిమా ఎదుగుదలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ చలనచిత్ర రంగంలో భారత్ శక్తివంతమైన దేశంగా ఎదుగుతున్న తరుణంలో మన చిత్ర పరిశ్రమ అనుస రించాల్సిన వ్యూహంపై స్పష్టతనిచ్చారు. అంతర్జాతీయ వేదికలపై `ఇండియా గెలవాలంటే.. అది మరింత ఇండియన్‌గా మారాలి`అని ఆయన పేర్కొనడం ఇండస్ట్రీ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. హాలీవుడ్‌ను అనుకరించడం కాకుండా మన మూలాల్లోని కథలను బలంగా నమ్ముకున్నప్పుడే విశ్వవ్యాప్తంగా గుర్తింపు లభిస్తుందని అభిప్రాయపడ్డారు.
భారతీయ సంస్కృతి, పురాణాల గొప్పతనాన్ని చాటిచెప్పే కథలకు గ్లోబల్ ఆడియన్స్‌ను ఆకట్టుకునే సత్తా ఉందని ఆది శంకర్ నొక్కి చెప్పారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఇండియన్ స్క్రీన్ పై రాబోతున్న ప్రతిష్టాత్మక పౌరాణిక చిత్రం 'రామాయణ` ను ప్రత్యేకంగా ప్రశంసించారు. మన పురాణ గాథలను అత్యున్నత సాంకేతిక విలువల తోడుతో లార్జర్-ద్యాన్-లైఫ్ విజువల్స్‌గా మార్చినప్పుడు ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తుందన్నారు. అలాగే ఇటీవల బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లతో దూసుకుపోతున్న రణవీర్ సింగ్ లేటెస్ట్ మూవీ `ధురందర్` కంటెంట్‌ను కూడా ఆయన అభినందించారు.
ఒకప్పుడు కేవలం పశ్చిమ దేశాల చిత్రాలకే పరిమితమైన అంతర్జాతీయ మార్కెట్ ఇప్పుడు సరిహద్దులు దాటి వైవిధ్యమైన కథలను ఆహ్వానిస్తోందని విశ్లేషించారు. భారతీయ మేకర్స్ సొంత కథలను, సంస్కృతిని గ్లోబల్ స్టాండర్డ్స్‌కు తగ్గట్టుగా ప్రెజెంట్ చేసినప్పుడే నిజమైన సినిమా పవర్ ఏంటో తెలుస్తుందని ఆది శంకర్ అన్నారు.`రామాయణ`, `ధురందర్` వంటి చిత్రాలు భారతీయ సినిమా గ్లోబల్ మార్కెట్ సామర్థ్యాన్ని మరింత విస్తృతం చేస్తాయని ట్రేడ్ వర్గాలు కూడా నమ్ముతున్నాయి. హాలీవుడ్ మేకర్స్ సైతం భారతీయ కంటెంట్ వైపు ఆకర్షితులవుతుండటం మన సినిమా నెక్స్ట్ లెవెల్ ఎదుగుదలకు నిదర్శనంగా చెప్పొచ్చు






































