కథల ఎంపికపై మెగాస్టార్ సంచలన వ్యాఖ్యలు!
Chiranjeevi Sensational comments On Script Selection
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి కథల ఎంపిక ..తనలోని నటుడి ఆకాంక్షలపై తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన 'పెద్ది' చిత్రబృందంతో ముచ్చటించిన సందర్భంగా చిరు పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. గతంలో లెజండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు తన సినిమాల గురించి తరచూ చర్చించేవారని చిరు గుర్తుచేసుకున్నారు.
`రుద్రవీణ`, `ఆపద్బాంధవుడు` వంటి చిత్రాలలో అద్భుతమైన నటన కనబరిచావని బాలు గారు తనను ఎంతగానో అభినందించేవారన్నారు. ఆ తర్వాత పూర్తిగా కమర్షియల్ జోనర్ వైపు మొగ్గుచూపడంపై ఆయన కొంత అభి ప్రాయాన్ని పంచుకున్నారని మెగాస్టార్ ఈ సందర్భంగా బయటపెట్టారు. పాత జ్ఞాపకాలను ప్రస్తావిస్తూనే.. నేటి తరం సినిమాలపై చిరంజీవి ఒక కీలకమైన స్పష్టతనిచ్చారు.
ఒక నటుడిగా ప్రయోగాత్మక, నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేయడానికి తన సామర్థ్యం ఎప్పుడూ తగ్గలేదన్నారు. అలాంటి బలమైన కథాంశాలు వస్తే నటించడానికి తాను ఇప్పటికీ వంద శాతం సిద్ధంగా ఉంటానని ప్రకటించారు.
కేవలం మాస్ మసాలా ఫార్ములాలకే పరిమితం కాకుండా కంటెంట్ ఉన్న కథలు వస్తే తనలోని పూర్తిస్థాయి విలక్షణ నటుడిని మళ్లీ ఆవిష్కరించడానికి అభ్యంతరం లేదని మెగాస్టార్ చెప్పిన మాటలు టాలీవుడ్ వర్గాల్లో సరికొత్త చర్చకు దారితీస్తున్నాయి.








































