నీడలా రక్షించే శక్తులు..హీరోల పాలిట బాడీగార్డులు

Stars And their Bodyguards

 

బాలీవుడ్‌లో నటీనటులకు ఉన్న క్రేజ్ -ఫ్యాన్ బేస్ అంతా ఇంతా కాదు. అగ్ర తారలు ఎక్కడకు వెళ్లినా వారిని చూడటానికి వేలాది మంది అభిమానులు తరలివస్తుంటారు. ఈ క్రమంలో సెలబ్రిటీల భద్రత అనేది అత్యంత కీలకమైన అంశంగా మారుతుంది. తారల చుట్టూ రక్షణ వలయాన్ని ఏర్పాటు చేస్తూ, అభిమానుల కోలాహలం నుండి వారిని సురక్షితంగా చూసుకునే బాడీగార్డ్స్ పాత్ర పరిశ్రమలో ఎంతో ప్రాధాన్యతను సంత‌రించుకుంది. వారు కేవలం సిబ్బందిగా మాత్రమే కాకుండా.. స్టార్ల జీవితంలో ఒక కుటుంబ సభ్యుడిగా మారిపోతుంటారు.

బాలీవుడ్‌లో  అందరికీ సుపరిచితమైన బాడీగార్డ్ ఎవరంటే షేరా  అనే పేరు ముందుగా గుర్తొస్తుంది. గత మూడు దశాబ్దాలుగా ఆయన బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు నీడలా ఉంటూ రక్షణ కల్పిస్తున్నారు. సల్మాన్ ఖాన్ ఎక్కడికి వెళ్లినా ఆయన కంటే ముందు షేరా అక్కడ ప్రత్యక్షమవుతుంటారు.  ఇద్ద‌రి  మధ్య ఉన్న బంధం  యజ మాని, ఉద్యోగి లాంటిది కాదు. సల్మాన్‌ను తన అన్నయ్యగా భావిస్తానని షేరా పలు సందర్భాల్లో పేర్కొన్నారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో సల్మాన్ ఖాన్ అభిమానులకు కూడా షేరా ఒక సెలబ్రిటీలా మారిపోయారు.

అలాగే బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ రక్షణ బాధ్యతలను చూసుకునే రవి సింగ్  కూడా పరిశ్రమలో ఎంతో గుర్తింపు పొందారు. షారూఖ్ ఖాన్‌ను చూసేందుకు గ్లోబల్ వ్యాప్తంగా విమానాశ్రయాల్లో, ఈవెంట్లలో వేల సంఖ్యలో జనం ముంచెత్తుతుంటారు. అలాంటి  భారీ జనసందోహాన్ని నియంత్రిస్తూ, కింగ్ ఖాన్‌కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రవి సింగ్ ఎంతో చాకచక్యంగా వ్యవహరిస్తుంటారు. అత్యంత కఠినమైన భద్రతా వలయాన్ని నిర్మించడంలో రవి సింగ్ సిద్ధహస్తుడిగా పేరు తెచ్చుకున్నారు. పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే బాడీగార్డ్స్‌లో ఈయన కూడా ఒకరు.

అమీర్ ఖాన్‌కు రక్షకుడిగా వ్యవహరిస్తూ బాలీవుడ్ యువ హీరోలకు భద్రత కల్పిస్తున్న యువరాజ్ ఘోర్పడే  వంటి వారు కూడా ఈ రంగంలో ప్రత్యేక ముద్ర వేశారు.  దీపికా పదుకొణె బాడీగార్డ్ జలాల్, అమితాబ్ బచ్చన్ మాజీ బాడీగార్డ్ జితేంద్ర షిండే వంటి వారు అంకితభావంతో వార్తల్లో నిలిచారు. తాజాగా రామ్ చ‌ర‌ణ్ బాడీ గార్డ్ గా కెవిన్ కుంట ఎంత ఫేమ‌స్ అవుతున్నాడో తెలిసిందే. `పెద్ది` ప్ర‌చారంలో రామ్ చ‌ర‌ణ్ కంటే ఎక్కువ‌గా కెవిన్ కుంటా హైలైట్ అయ్యాడు. ఇప్పుడు కెవిన్ ఇండియాలో ఓ సెల‌బ్రిటీలా మారిపోయాడు.

Highest-paid celebrity bodyguards