పెద్ది` వివాదం - నిత్యామీనన్ క్లాస్
Nithya menon on Peddi controversy
గ్లామర్.. కమర్షియల్ హంగుల పేరుతో వెండితెరపై మహిళా పాత్రలను వస్తువుల్లా మార్చడం చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. `పెద్ది` చిత్రంలో జాన్వీ కపూర్ పోషించిన అచ్చియమ్మ పాత్ర చుట్టూ ముసిరిన వివాదంపై దర్శకుడు బుచ్చిబాబు సానా బహిరంగ క్షమాపణలు చెప్పే వరకు వెళ్ళింది. ఈ సున్నితమైన అంశంపై సీనియర్ నటి నిత్యామీనన్ స్పందించిన తీరు హాట్ టాపిక్‌గా మారింది. పైకి ఇది వ్యవస్థపై లేదా అతి వ్యాపార ధోరణిపై చేసిన విమర్శలా కనిపించినప్పటికీ లోతుగా పరిశీలిస్తే మాత్రం గ్లామర్ పాత్రల ఎంపికలో సరిహద్దులు దాటుతున్న జాన్వీ కపూర్ లాంటి నేటి తరం యువ కథానాయికలకు నిత్య పరోక్షంగా గట్టి క్లాస్ పీకినట్లే ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నిత్యామీనన్ తన వ్యాఖ్యల్లో ఎక్కడా జాన్వీ పేరును నేరుగా ప్రస్తావించకపోయినా? ఆమె వాడిన పదాలు యువ నటీమణుల ఆలోచనా ధోరణిని, వారి పాత్రల ఎంపికలను ప్రశ్నించేలా ఉన్నాయి. కేవలం పెద్ద సినిమాలు, స్టార్ స్టేటస్ .. కీర్తి ప్రతిష్టల కోసం ఆరాటపడితే మేకర్స్ అడిగే ఎలాంటి పాత్రలకైనా, ఎంతటి శృతిమించిన గ్లామరైజేషన్‌కైనా రాజీ పడాల్సి వస్తుందని చాలా సున్నితంగా చురకలు వేశారు.
పరిశ్రమలో తాము నిస్సహాయులమని అనుకోవడం ముమ్మాటికీ తప్పని.. తమకు అసౌకర్యంగా అనిపించే తమ ఆత్మగౌరవాన్ని తక్కువ చేసి చూపించే సన్నివేశాలు ఉన్నప్పుడు కెరీర్ ప్రారంభం నుంచే నో చెప్పే ధైర్యాన్ని అలవర్చుకోవాలని హితవు పలికారు. ఈ రకమైన సూచనలు పరోక్షంగా పెద్ది లాంటి కమర్షియల్ ప్రాజెక్ట్‌లలో అభ్యంతరకరమైన పాత్రలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన జాన్వీ ఎంపికలపై వ్యంగ్యాస్త్రాలు సంధించినట్లే ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.







































