ఫార్మాసిటీ బ్లాస్ట్.. వైజాగ్‌లో మరో దుర్ఘటన
Explosion at Dakshin Energy unit in Visakhapatnamవిశాఖ ఫార్మాసిటీలో బ్లాస్టులు, విషాదాల పరంపర ముగింపు లేని కథలా సాగుతోంది. తాజాగా అనకాపల్లి జిల్లా పరవాడ పారిశ్రామిక వాడలోని దక్షిణ్ ఎనర్జీ ప్లాంట్‌లో సంభవించిన బాయిలర్ పేలుడు, ఇద్దరు యువ కార్మికులను బలితీసుకుని పారిశ్రామిక భద్రతపై నివురుగప్పిన నిప్పులాంటి సత్యాలను మరోసారి తెరపైకి తెచ్చింది. గతంలో చోటుచేసుకున్న ఎల్జీ పాలిమర్స్, సైనోర్ లైఫ్ సైన్సెస్, విశాఖ సాల్వెంట్స్ వంటి వరుస గుణపాఠాలు ఎన్ని ఎదురవుతున్నా.. యాజమాన్యాల లాభార్జన ధోరణి, అధికారుల నామమాత్రపు తనిఖీలు క్షేత్రస్థాయిలో మారలేదనడానికి ఈ దుర్ఘటనే నిదర్శనం. రాత్రిపూట సరైన రక్షణ వలయం లేకపోవడం, కేవలం కాంట్రాక్ట్ ఉద్యోగులపైనే భారమంతా వేయడం వల్లనే అభాగ్యులైన శ్రామికులు నిలువునా కాలిపోతున్నారనే ఆగ్రహం సర్వత్రా వ్యక్తమవుతోంది.
ఈ దారుణ దురంతం చుట్టూ జరుగుతున్న రాజకీయం, సామాజిక మాధ్యమాల పరస్పర నిందారోపణలు బాధిత కుటుంబాల వేదనను మరింత హేయంగా మారుస్తున్నాయి. పాలక పక్షాల వైఫల్యాలను ఎండగట్టడం ఒకవైపు నడుస్తుంటే..
మరోవైపు కొన్ని డిజిటల్ మీడియా సంస్థలు టీఆర్‌పీ రేటింగుల కోసం `శవాల కుప్పలు` అంటూ సంచలన థంబ్ నెయిల్స్‌తో సామాన్యులలో భయాందోళనలు సృష్టిస్తూ పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తున్నాయి. బాధిత కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా డిమాండ్ నెట్‌లో ఊపందుకుంటున్న తరుణంలో.. కేవలం పరిహారాల ప్రకటనలతో సరిపెట్టకుండా... పరిశ్రమల సురక్షిత ఆడిటింగ్‌ను కఠినతరం చేసి శాశ్వత నివారణ చర్యలు చేపట్టడమే ఈ వ్యవస్థ కార్మికులకు ఇచ్చే నిజమైన నివాళి.







































