భయం వీడిన బాలీవుడ్!
Bollywood Industryదేశ రాజధానిలోని జంతర్ మంతర్ వేదికగా విద్యార్థులు చేపట్టిన నిరసనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. నిన్న మొన్నటి వరకు ప్రభుత్వ విధానాలను విమర్శించేందుకు.. సున్నితమైన సామాజిక అంశాలపై గళం విప్పేందుకు వెనకాడిన బాలీవుడ్ ప్రముఖులు ఇప్పుడు ఆ భయాన్ని పూర్తిగా వీడుతున్నారు. విద్యార్థులు ప్రదర్శిస్తున్న తెగువ, మొక్కవోని దీక్ష ఇండస్ట్రీలోని అగ్ర తారలకు సరికొత్త ధైర్యాన్ని నూరి పోస్తున్నాయి. యువత చేస్తున్న పోరాటం కేవలం విద్యా రంగానికి మాత్రమే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య గొంతుకను మరింత గట్టిగా వినిపించేలా చేస్తోంది.
సామాజిక మాధ్యమాల ద్వారా మద్దతు తెలపడానికే పరిమితం కాకుండా బాలీవుడ్ ప్రముఖులు నేరుగా జంతర్ మంతర్ లైవ్ లొకేషన్‌కు వస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. స్టార్ హీరోలు .. ప్రముఖ నటులు ఎలాంటి భయాలు లేకుండా నేరుగా నిరసన ప్రాంతానికి చేరుకుని విద్యార్థులతో మమేకమవడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. ప్రభుత్వాలు ..అధికార వర్గాల నుంచి వస్తోన్న ఒత్తిళ్లను లెక్కచేయకుండా, ప్రత్యక్షంగా రంగంలోకి దిగి యువతకు సంఘీభావం తెలపడం బాలీవుడ్ చరిత్రలో సాహసోపేతమైన పరిణామంగా నిలుస్తోంది.
ఈ పరిణామం సినీ పరిశ్రమకు, ప్రభుత్వాలకు మధ్య కొత్త చర్చకు తెరలేపింది. దశాబ్దాలుగా రాజకీయ .. ప్రభుత్వ ఒత్తిళ్లకు తలొగ్గి మౌనం వహించిన బాలీవుడ్ ఇకపై ప్రజల పక్షాన నిలబడటానికి వెనుకాడవనే సంకేతాలను ఈ ఉద్యమం ఇస్తోంది. స్టార్ల రాకతో విద్యార్థుల ఆందోళనకు జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు రావడంతో పాటు, వారి ఆవేదన నేరుగా అధికార కేంద్రాలను తాకుతోంది.
సెలబ్రిటీల ప్రత్యక్ష మద్దతు ఉద్యమానికి నైతిక బలాన్ని ఇవ్వడమే కాకుండా పాలకులలో చలనం తెచ్చేలా చేస్తోంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ధైర్యం తెచ్చుకోవాలని సోషల్ మీడియాలో నెటి జనులు కోరుతున్నారు. వెండి తెర హీరోలకు రియల్ హీరోలయ్యే గొప్ప అవకాశం ఇదేనంటూ పోస్టులు పెడుతున్నారు. పోరాడితే పోయేదేముంది బానిస సంకేళ్లు తప్ప అన్న నినాదాన్ని గుర్తు చేస్తున్నారు. మరి టాలీవుడ్ స్టార్లు ఇప్పటికైనా కదులు తారా? లేదా? అన్నది చూడాలి.








































