భారతీయ విద్యార్థుల పోరాటానికి హాలీవుడ్ మద్దతు!
Hollywood supports the struggle of Indian students!నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై విద్యార్థులు చేపడుతున్న ఆందోళనలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి చేరాయి. జంతర్ మంతర్ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో సాగుతున్న నిరసనలకు ప్రముఖ హాలీవుడ్ నటుడు జాన్ కుసాక్ తన పూర్తి మద్దతును ప్రకటించారు. ఇటీవల విద్యార్థులు చేపట్టిన చలో సంసద్ కార్యక్రమంపై పోలీసులు లాఠీచార్జి చేయడం, భాష్పవాయువు ప్రయోగించడం వంటి ఘటనల నేపథ్యంలో ఆయన సామాజిక మాధ్యమాల ద్వారా స్పందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. విద్యార్థుల భవిష్యత్తు కోసం జరుగుతున్న ఉద్యమానికి సంఘీభావం తెలపడం ద్వారా సమస్యపై గ్లోబల్ అటెన్షన్ పెరిగింది.
నిరసనల పట్ల అధికారుల తీరును విమర్శిస్తూ ప్రముఖ రచయిత్రి, సామాజిక కార్యకర్త అరుంధతీ రాయ్ రాసిన సుదీర్ఘ వ్యాసాన్ని జాన్ కుసాక్ తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. ఆ వ్యాసానికి ఆయన స్పందిస్తూ అరుంధతీ రాయ్‌ను ఉద్దేశించి `నాకు ఇష్టమైన తోటి కాక్రోచ్ నుంచి వచ్చిన అందమైన వార్త` అంటూ తనదైన శైలిలో క్యాప్షన్ కూడా జోడించారు. ప్రజాస్వామ్యంలో విద్యార్థుల హక్కులను అణచివేసే చర్యలను ప్రశ్నించేలా ఉన్న ఆర్టికల్‌ను గ్లోబల్ ఆడియన్స్‌కు చేరవేయడం ద్వారా భారతదేశంలో విద్యా వ్యవస్థ చుట్టూ జరుగుతున్న పరిణామాలపై పశ్చిమ దేశాల దృష్టిని ఆకర్షించేలా చేశారు.
భారతీయ విద్యార్థుల పోరాటాలకు జాన్ కుసాక్ మద్దతు పలకడం ఇదే తొలిసారి కాదు. 2019లో పౌరసత్వ సవరణ చట్టానికి (CAA) వ్యతిరేకంగా ఆందోళనలు జరిగినప్పుడు, జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయ విద్యార్థులపై పోలీసుల చర్యలను సైతం ఆయన తీవ్రంగా ఖండించారు. విద్యార్థుల గళానికి హాలీవుడ్ స్థాయి గుర్తింపు దక్కడం పాలకులకు స్పష్టమైన సందేశాన్ని ఇస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
















































