సౌత్ మార్కెట్‌లోకి IP బాబులు!

South Movie Market

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో కేవలం ఒకే ఒక శుక్రవారం బాక్సాఫీస్ వసూళ్లపై ఆధారపడే సాంప్రదాయ పెట్టుబడి విధానానికి కాలం చెల్లుతోంది. వినోద రంగంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న దక్షిణ భారత మార్కెట్‌ను చేజిక్కించుకోవడానికి అంతర్జాతీయ కార్పొరేట్ శక్తులు సరికొత్త `మేధో సంపత్తి` (ఇంటెలెక్చువ‌ల్ ప్రాప‌ర్టీ - IP) వ్యూహంతో ముందుకు వచ్చాయి.

ఇందులో భాగంగానే గ్లోబల్ ఫైనాన్స్ సంస్థ `సినెనౌ` .., అనుభవజ్ఞుడైన సిద్ధార్థ్ రాయ్ కపూర్‌ను వ్యూహాత్మక సలహాదారుగా నియమించుకుని ఏకంగారూ. 1,350 కోట్ల భారీ ఐపీ నిధిని సిద్ధం చేసింది. ఈ నిధితో దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో దాదాపు 30కి పైగా చిత్రాలను నిర్మించనున్నారు. ఒక సినిమా ఆశించిన విజయం సాధించకపోయినా.. కథ, ఓటీటీ, శాటిలైట్, మ్యూజిక్, రీమేక్ , డబ్బింగ్ హక్కుల ద్వారా వచ్చే దీర్ఘకాలిక రాబడులు ఇన్వెస్టర్లకు పక్కా ఆర్థిక రక్షణ కల్పిస్తాయి.

ఇదే సమయంలో కేవలం వెండితెరకే పరిమితం కాకుండా స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను నేరుగా టార్గెట్ చేస్తూ యష్ రాజ్ ఫిల్మ్స్ (YRF) కూడా సరికొత్త ఐపీ రిజిస్ట్రేషన్ల ప్లాన్‌తో రంగంలోకి దిగింది. రస్క్ మీడియాతో కుదుర్చుకున్న వ్యూహాత్మక ఒప్పందం ద్వారా `ఒరిజినల్ యానిమేషన్`,  మొబైల్ స్క్రీన్‌లకు అనుగుణంగా ఉండే `వర్టికల్ మైక్రో-డ్రామాలు` సృష్టించడానికి వైఆర్ఎఫ్ క్రియేటివ్ డైరెక్ష‌న్ చేపట్టింది.

ఈ కంటెంట్‌ను రస్క్ మీడియా తన సొంత ఆల్‌రైట్‌ TV ప్లాట్‌ఫార్మ్‌తో పాటు గ్లోబల్ డిజిటల్ ఛానెళ్ల ద్వారా ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేయనుంది. ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్ వాడకం విపరీతంగా పెరిగిన నేటి తరుణంలో గ్లోబల్ `వర్టికల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎకానమీ`లో భారతదేశాన్ని ఒక బలమైన సృజనాత్మక శక్తిగా నిలబెడుతూ.. సరిహద్దులు లేని పాన్-ఇండియా మార్కెట్‌పై ఈ దిగ్గజాలు పట్టు సాధించాల‌ని గ‌ట్టి ప్లాన్ తో ఉన్నాయి.

South Industry