సీనియర్ స్టార్ అదృశ్యం ఇప్పటికీ మిస్టరీగానే!
Karz, Arth actor Raj Kiran disappeared from Bollywoodసినిమా రంగంలో వెలుగుల వెనుక ఎన్నో చీకటి కోణాలు దాగి ఉంటాయి. ఒకప్పుడు వెండితెరపై స్టార్‌గా వెలిగి, ఆ తర్వాత కాలగర్భంలో కలిసిపోయిన నటీనటులు ఎందరో ఉన్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ నటుడు రాజ్ కిరణ్ ఒకరు. `కర్జ్`, `అర్థ్` వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించిన రాజ్ కిరణ్ తొంభైల దశ కంలో అవకాశాలు తగ్గడంతో తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనయ్యారు. ఒకానొక దశలో రాజ్ కిరణ్ అకస్మాత్తుగా అదృశ్యం కావడం బాలీవుడ్లో పెద్ద మిస్టరీగా మారింది. రెండు దశాబ్దాలు గడుస్తున్నా ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు నేటికీ వెతుకుతూనే ఉన్నారనే ప్రచారముంది.
రాజ్ కిరణ్ కెరీర్ గ్రాఫ్ పడిపోతున్న సమయంలో ఆయన వ్యక్తిగత జీవితంలోనూ తీవ్రమైన ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. మానసిక సమస్యలతో బాధపడుతున్న రాజ్ కిరణ్ ను దర్శకుడు మహేష్ భట్ ఒకసారి ముంబైలోని మానసిక చికిత్సా కేంద్రంలో కలిశారు. అప్పట్లో ఎంతో ఉత్సాహంగా ఉండే రాజ్ కిరణ్, అక్కడ తీవ్ర నైరాశ్యంలో కనిపించారని ఆయన గుర్తుచేసుకున్నారు. ఆ తర్వాత రాజ్ కిరణ్ అమెరికాకు వెళ్లడం, 2003 నుండి కుటుంబ సభ్యులతో పూర్తిగా సంబంధాలు తెగిపోవడంతో ఆయన ఎక్కడున్నారనేది ఎవరికీ తెలియకుండా పోయింది.
ఈ క్రమంలో ఆయన అట్లాంటాలోని ఓ మానసిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. రాజ్ కిరణ్‌తో కలిసి నటించిన దివంగత నటుడు రిషి కపూర్ కూడా ఆయన బతికే ఉన్నాడనే సమాచారం తెలిసి ఉపశమనం పొందానని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అయితే ఈ వార్తలను రాజ్ కిరణ్ కుమార్తె ఖండించారు. తమ తండ్రి అట్లాంటాలో ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని ఆయన కోసం తాము ఇంకా అన్వేషిస్తూనే ఉన్నామని స్పష్టం చేశారు. ఒక ప్రతిభావంతుడైన నటుడి జీవితం ఇలా అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోవడం సినీ పరిశ్రమను సైతం కలచివేస్తోంది.








































