ప్రెస్ మీట్‌లో జ‌యం ర‌వి క‌న్నీళ్లు!

Jayam Ravi Emotional Press MeetJayam Ravi Emotional Press Meet

తమిళ చిత్ర పరిశ్రమలో పాపుల‌ర్ క‌థానాయ‌కుడిగా జయం రవి (రవి మోహన్) సుప‌రిచితుడు. అత‌డు తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొంటున్న మానసిక సంఘర్షణ ప‌రిశ్ర‌మ‌లో తీవ్ర కలకలం రేపింది. తాజాగా నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆయన మీడియా ముందు కన్నీరు పెట్టుకుంటూ.. తనకు అధికారికంగా విడాకులు వచ్చేంత వరకు తన కొత్త సినిమాలు ఏవీ థియేటర్లలో విడుదల కాబోవంటూ ఆవేద‌న వ్య‌క్తం చేసారు.

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న విపరీతమైన ఆన్‌లైన్ ట్రోలింగ్ వల్ల తాను తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనయ్యానని, అదే తన వ్యక్తిగత జీవితంలో తలెత్తిన విభేదాలకు కారణమైందని ఆవేదన వ్యక్తం చేశారు. తన 23 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఎంతోమంది అగ్ర హీరోయిన్లతో అత్యంత ప్రొఫెషనల్‌గా పనిచేసిన తనపై, 45 ఏళ్ల వయసులో ఇలాంటి బురదజల్లడం సిగ్గుచేటని పేర్కొన్న అత‌డు తన వృత్తిపరమైన.. వ్యక్తిగత జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్న శక్తులకు గట్టి హెచ్చరిక జారీ చేశారు.

ప్రస్తుతం తన జీవితంలోనే చీక‌టి ద‌శ‌ను అనుభవిస్తున్నానని చెప్పిన జయం రవి, తాను సంపాదించిన సంపాదన అంతా పోయిందని.. ప్రస్తుతం తనకు కనీస ఆర్థిక స్వాతంత్య్రం కూడా లేకుండా పోయిందనే చేదు నిజాన్ని బయటపెట్టారు. ఇదే సమయంలో తన వైవాహిక జీవితంలో ఇంతటి తుఫాను రేగడానికి మూడంకెల పేరున్న ఒక మహిళే మూలకారణమంటూ క్రిప్టిక్ పోస్ట్ తో క్లూ ఇవ్వడం పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.

ఇప్పటివరకు తాను కేవలం డిఫెన్స్ మోడ్‌లో మాత్రమే ఉన్నానని.. కానీ ఇకపై సైలెంట్‌గా ఉండే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తారు. లీగల్ పరంగా తన పోరాటం కొనసాగిస్తూనే.. తనను కావాలని రెచ్చగొట్టాలని చూసేవారిపై యాక్షన్ మోడ్‌లోకి మారుతున్నానని.. భ‌విష్యత్ లో ఏం జరుగుతుందో చూద్దామంటూ ఆయన తన భావోద్వేగ ప్రసంగాన్ని ముగించారు.

Jayam Ravi