ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Kajal Aggarwal on Dark Side of film industry

వెండితెర వెనుక అసమానతలపై గళం విప్పిన కాజల్

Kajal Aggarwal on Dark Side of film industry

 

చిత్ర పరిశ్రమలో పైకి కనిపించే రంగుల వెనుక ఎన్నో చీకటి కోణాలు, అసమానతలు దాగి ఉన్నాయనేది బహిరంగ రహస్యం. తాజాగా సీనియర్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పరిశ్రమలో నేటికీ కొనసాగుతున్న వివక్షపై చేసిన సంచలన వ్యాఖ్యలు ఇండస్ట్రీ వర్గాల్లో  చర్చకు దారితీశాయి. దశాబ్ద కాలానికి పైగా అగ్ర కథానాయికగా రాణించి.. ఎందరో స్టార్ హీరోల సరసన నటించిన కాజ‌ల్ పరిశ్రమలో మహిళా నటీమణులు ఎదుర్కొంటున్న అంతర్గత వివక్షను బాహాటంగానే ప్రశ్నించారు. సాంకేతికంగా, ఆర్థికంగా సినిమా రంగం ఎంత అభివృద్ధి చెందుతున్నా? నటీనటుల మధ్య చూపే తారతమ్యాలు, మైండ్‌సెట్ ఇంకా మారకపోవడం విచారకరమని అభిప్రాయపడ్డారు.

సాధారణంగా చిత్ర పరిశ్రమలో  రెమ్యునరేషన్ పరంగానే కాకుండా నటీమణులకు ఇచ్చే గౌరవం, సెట్స్‌లో లభించే ప్రాధాన్యతలలో కూడా తీవ్ర వివక్ష కనిపిస్తుందని కాజల్ పరోక్షంగా పేర్కొన్నారు. ఒక సినిమా విజయంలో హీరోలతో సమానంగా హీరోయిన్లు కూడా శ్రమిస్తున్నప్పటికీ గుర్తింపు  క్రెడిట్ విషయానికి వచ్చేసరికి పురుషాధిక్యతే స్పష్టంగా కనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా పెళ్ళి అయిన తర్వాత .. ఒక వయసు దాటిన తర్వాత నటీమణులను చూసే కోణం పూర్తిగా మారిపోతుందని.. అదే హీరోల విషయంలో మాత్రం వయసుతో సంబంధం లేకుండా స్టార్‌డమ్ ..అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని ఈ రకమైన ఇండస్ట్రీ మైండ్‌సెట్‌ను వేలెత్తి చూపారు.

పరిశ్రమలో సుదీర్ఘ అనుభవం .. భారీ ఫ్యాన్ బేస్ ఉన్న కాజల్ లాంటి అగ్ర నటి నుండి ఇలాంటి వ్యాఖ్యలు రావడం సాధారణ విషయం కాదు. ఇది కేవలం ఆమె వ్యక్తిగత అసంతృప్తి మాత్రమే కాదని.. పరిశ్రమలో ఏళ్ళ తరబడి వేళ్ళూనుకుపోయిన వ్యవస్థాగత లోపాలను ఎండగట్టడమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. కొత్త తరం మేకర్స్ .. మహిళా దర్శకులు ఈ వివక్షను రూపుమాపడానికి కొంతవరకు ప్రయత్నిస్తున్నప్పటికీ పాతకాలపు ఆలోచనా ధోరణి మూలాల నుండి మారనంత వరకు వెండితెరపై నిజమైన సమానత్వం సాధ్యం కాదని కాజల్ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.

Kajal Aggarwal On gender inequities