టాలీవుడ్ ఎంట్రీపై డెబ్యూ నటి సుస్మితా శెట్టి కామెంట్స్!
Sushmita Shetty comments on her Tollywood entry!యువ నటి సుస్మితా శెట్టి- ఇంటర్నెట్ సెన్సేషన్ మౌలి తనుజ్ ప్రశాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న `దొంగ నా కొడుకు` సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో సుస్మితా శెట్టి సినీ ప్రయాణం - అనుభవాల గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. దిగ్గజ నటి శ్రీదేవి తనకెంతో స్ఫూర్తి అని ఆమె తెలిపారు. చిన్నప్పటి నుంచి నృత్యంపై మక్కువతో పలు నాట్య రూపాలను నేర్చుకున్నానని.. ముఖ కవళికల ద్వారా భావాలను వ్యక్తపరచడమే తనను సినిమాల వైపు ఆకర్షించేలా చేసిందని వెల్లడించారు. విదేశాలలో చదువు పూర్తి చేసుకున్న సుస్మిత అక్కడ థియేటర్ ఆర్ట్స్‌లోనూ అనుభవం సంపాదించారు. ఈ చిత్రానికి ముందు ఆమె `జగమే సంగీతం` అనే వెబ్ సిరీస్‌లో కూడా నటించారు.
ఈ సినిమాలో తన పాత్ర గురించి మాట్లాడుతూ సుస్మితా శెట్టి తనది చాలా క్యూట్, బబ్లీ ఉత్సాహంగా ఉండే పాత్ర అని పేర్కొన్నారు. ఇందులో ఈశ్వర్ (మౌలి) పాత్రను గాఢంగా ప్రేమించే అమ్మాయిగా తాను కనిపిస్తానని చెప్పారు. తన పాత్ర చాలా అమాయకమైనదని, తాను ఎంతో తెలివైనదానిగా భావించినప్పటికీ అనుకోకుండా కొన్ని ఇబ్బందుల్లో.. అలాగే చిన్నపాటి క్రైమ్‌లో చిక్కుకుంటుందని తెలిపారు. తాను చేసే ప్రతి చిన్న ప్రయత్నం కూడా సినిమాలో ఫన్నీగా మారుతుందని ఈ క్యారెక్టర్‌లో అమాయకమైన కామెడీ ప్రేక్షకులను అలరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
హీరో మౌలి తనుజ్ ప్రశాంత్‌తో పనిచేయడం మంచి అనుభవమని పేర్కొన్న సుస్మిత ఆయన ఎంతో ప్రతిభావంతుడని, వినయశీలి అని ప్రశంసించారు. ఇక టాలీవుడ్‌లో రామ్ చరణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్‌లను ఫేవరెట్ డాన్సర్లుగా పేర్కొన్నారు. కీర్తి సురేష్ నటించిన`మహానటి` చిత్రం చాలా ఇష్టమని తెలిపారు. భవిష్యత్తులో అలాంటి బలమైన భావోద్వేగాలున్న పాత్రలతో పాటు రొమాంటిక్ కామెడీ, థ్రిల్లర్, స్పోర్ట్స్ డ్రామా వంటి విభిన్న జోనర్‌లలో నటించాలని ఉందని మనసులో మాట బయటపెట్టారు.
















































