ఇంటి పేరు గొప్పదైతే కష్టం రెట్టింపు!
Krishnavataram - Part 1: The Heart Update
`కృష్ణావతారం పార్ట్ 1: ది హార్ట్` చిత్రంలో సత్యభామ పాత్ర ద్వారా నటిగా తెరంగేట్రం చేసిన సంస్కృతి జయానా ఇటీవల తన తొలి సినిమా అనుభవాలను.. సినీ ప్రయాణంపై అభిప్రాయాలను పంచుకున్నారు. సాధారణంగా శ్రీకృష్ణుడి కోణంలో చెప్పే పౌరాణిక కథను ఈ చిత్రంలో సత్యభామ దృష్టికోణం నుండి ఆవిష్కరించారని అలాంటి బలమైన పాత్రను పోషించడం ఎంతో బాధ్యతతో కూడుకున్న విషయమన్నారు. నేటి తరం మహిళలు ఆకాంక్షించే స్వతంత్ర భావాలు, ఆత్మవిశ్వాసం, సొంత గుర్తింపు ఆ కాలంలోనే సత్యభామలో ఉన్నాయని అలాంటి స్ఫూర్తిదాయకమైన పాత్రలో నటించడం తనకు లభించిన గొప్ప అవకాశమన్నారు.
ఈ సందర్భంగా కుటుంబ నేపథ్యం, పరిశ్రమలో ఎదురయ్యే సవాళ్ల గురించి సంస్కృతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ గవర్నర్, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్ మనవరాలైన సంస్కృతి, ప్రజా సేవలో పేరుగాంచిన కుటుంబం నుండి వచ్చారు. ప్రముఖ కుటుంబ నేపథ్యం ..పేరున్న సర్ నేమ్ (ఇంటి పేరు) ఉన్నప్పుడు ప్రజల అంచనాలు ఎక్కువగా ఉంటాయని.. అందుకే ప్రతిభను నిరూపించుకోవడానికి ఇతరుల కంటే మరింత కష్టపడి పనిచేయాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు.
కుటుంబ ప్రతిష్టను, వారి విలువలను ముందుకు తీసుకెళ్తూ కళ ద్వారా సమాజానికి తన వంతు తోడ్పాటు అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు. భవిష్యత్ సినీ ప్రయాణం గురించి మాట్లాడుతూ... `ప్రపంచ ప్రసిద్ధ నటన పాఠశాలల్లో శిక్షణ పొందిన తాను కేవలం పెద్ద సినిమాలు ..పెద్ద పాత్రల వెనుక పడకుండా నటనకు సవాలు విసిరే వైవిధ్యమైన పాత్రలను ఎంచుకోవడానికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. భాష లేదా పాత్ర నిడివితో సంబంధం లేకుండా సమాజంపై ప్రభావం చూపే మంచి కథలలో భాగం కావాలని భావిస్తున్నట్లు చెప్పారు. తొలి సినిమాతోనే ప్రేక్షకుల దగ్గరైన నేపథ్యంలో భవిష్యత్తు కథల ఎంపికలో తొందరపాటు లేకుండా బాధ్యతాయుతంగా ముందడుగు వేస్తానని సంస్కృతి జయానా స్పష్టం చేశారు.
















































