రాజకీయ వివాదంలో త్రిషకు దక్కిన అభయహస్తం!
Kangana Ranaut supports Trisha Krishnanతమిళనాడు రాజకీయ వేదికగా నటి త్రిష కృష్ణన్ చుట్టూ ముసురుకున్న వ్యక్తిగత విమర్శలు, వివాదాలపై బాలీవుడ్ నటి, హిమాచల్ ప్రదేశ్ లోక్‌సభ ఎంపీ కంగనా రనౌత్ స్పందించారు. నటుడు, తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ - డిఎమ్‌కె నాయకుడు ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యల నేపథ్యంలో త్రిషపై సోషల్ మీడియాలో సాగుతున్న ట్రోలింగ్‌ను కంగనా ఖండించారు. ప్రజా జీవితంలో ఉన్న మహిళలను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని వారి శీలాన్ని శంకించడం సమాజంలో చెడు అలవాటుగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
హిమాచల్ ప్రదేశ్‌లోని కుల్లులో నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశం అనంతరం కంగనా రనౌత్ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా తమిళనాడులో చోటుచేసుకున్న పరిణామాలను ప్రస్తావించారు. `ఇరువర్గాల మధ్య ఎలాంటి సంబంధాలు ఉన్నా? విమర్శలు దుర్భాషల విషయానికి వస్తే మాత్రం ఎల్లప్పుడూ మహిళలనే లక్ష్యంగా చేసుకుంటారు` అని వ్యాఖ్యానించారు. విజయం సాధించిన మహిళలను, నటీమణులను, రాజకీయ నాయకురాళ్లను సమాజంలో కిందకు లాగడానికి వారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడం అనేది ఒక్క భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న దురదృష్టకర పరిణామమని పేర్కొన్నారు.
రెండు రాజకీయ వర్గాల మధ్య జరిగే వివాదాల్లోకి మహిళా కళాకారులను లాగి వారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదని కంగనా పేర్కొన్నారు. ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కూడా మహిళలపై ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేసే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించిన నేపథ్యంలో కంగనా రనౌత్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించే వైఖరి మారాలని, సమాజంలో ఉన్నత స్థానాల్లో ఉన్న మహిళలకు తగిన గౌరవం ఇవ్వాలని డిమాండ్ చేశారు.







































