తమ్ముడు పవన్ కి చిరు ప్రేమతో...
Chiranjeevi pens adorable birthday wish to Pawan Kalyan
ఈ రోజు సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ బర్త్ డే. పవన్ బర్త్ డే కి రాజకీయ, సినీప్రముఖులు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలుపుతుంటే.. మెగాస్టార్ చిరు తన తమ్ముడు పవన్ కి ప్రేమతో చెప్పిన బర్త్ డే విషెస్ మాత్రం తెగ వైరల్ అవుతున్నాయి.
సంకల్ప సాధకుడు కళ్యాణ్ బాబు.. @PawanKalyan
నిబద్ధత నిండిన ప్రేమ, బాధ్యతతో కూడిన సంకల్పం, అనుక్షణం ప్రజలకు మంచి చేయాలనే చిత్తశుద్ధి, ఇవన్నీ మా కళ్యాణ్ బాబులో చిన్నప్పటి నుంచీ చూస్తున్నాను. తాను చేసే ప్రతి పనిలో పూర్తిగా నిమగ్నమవుతూ, తన ప్రతి అడుగూ పదిమందికి మేలు చేయాలనే తపనతో వేస్తాడు.
మా కుటుంబంపై ఎంత ప్రేమ చూపిస్తాడో, తనను నమ్మిన ప్రజలపైనా అంతే ప్రేమ, వాత్సల్యం చూపిస్తాడు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత గ్రామాల అభివృద్ధి, గిరిజన ప్రాంతాల అభ్యున్నతి, పర్యావరణ పరిరక్షణ, ప్రజల మౌలిక అవసరాల కల్పన కోసం అంకితభావంతో పనిచేస్తూ పాలనలో తనదైన ముద్ర వేస్తున్నాడు.
ఏళ్లుగా పరిష్కారం కాని ఎన్నో సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపిస్తూ, అభివృద్ధిని మారుమూల ప్రాంతాలకు సైతం తీసుకువెళ్తున్న తీరు నాకు ఎంతో ఆనందాన్ని, గర్వాన్ని కలిగిస్తోంది. తనను గెలిపించిన పిఠాపురం ప్రజలకు ఒక ప్రజాప్రతినిధిగా కాకుండా, కుటుంబ సభ్యుడిలా అండగా నిలుస్తున్నాడు.
ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించే కళ్యాణ్ బాబు, తెలుగు ప్రజలందరూ మెచ్చే నాయకుడిగా తన భవిష్యత్ లక్ష్యాలను చేరుకునే క్రమంలో ప్రతి అడుగులోనూ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.
నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవిస్తూ, మరింత శక్తితో ప్రజాసేవకు పునరంకితం కావాలని మా ఇలవేల్పు శ్రీ ఆంజనేయస్వామిని ప్రార్థిస్తూ…
మా కళ్యాణ్ బాబుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💐💐💐
అన్నయ్య
చిరంజీవి







































