పసివాడి ప్రాణం స్ఫూర్తితోనే భజరంగి కథ
A Real Life Bajrangi Bhaijaan Storyచిరంజీవి కల్ట్ క్లాసిక్ `పసివాడి ప్రాణం` స్ఫూర్తితోనే తాము సల్మాన్ ఖాన్ బ్లాక్‌బస్టర్ హిట్ `భజరంగీ భాయిజాన్` కథను సిద్ధం చేశామని ప్రముఖ రైటర్ విజయేంద్ర ప్రసాద్ బహిరంగంగా అంగీకరించారు. కథ ప్రాథమిక చర్చల్లో తన తమ్ముడు కాంచి, సహాయకుడు మహదేవ్ ఇచ్చిన సలహాతో పాప ఎదుర్కొనే ప్రమాదాన్ని పాకిస్థాన్ నేపథ్యానికి మార్చామని.. కథానాయకుడి పాత్రను `జై శ్రీరామ్` జపించే భజరంగీలా తీర్చిదిద్దామని చెప్పారు. అయితే కేవలం ఒక పసిపాపను రక్షించే క్రైమ్ థ్రిల్లర్ అంశం తనకు రచయితగా పూర్తి సంతృప్తిని ఇవ్వలేదని.. కథలో ఏదో బలమైన ఎమోషన్ లోపించిందనే భావన చాలా కాలం వెంటాడిందని ఆయన వెల్లడించారు.
సరిగ్గా ఆ సమయంలో చెన్నై అపోలో ఆసుపత్రిలో ఉచితంగా గుండె ఆపరేషన్ చేయించుకుని భారతీయుల వైద్యుల దయార్థ హృదయానికి కన్నీళ్లు పెట్టుకున్న ఒక పాకిస్థానీ దంపతుల రియల్ లైఫ్ ఇంటర్వ్యూ విజయేంద్ర ప్రసాద్ హృదయాన్ని తీవ్రంగా కదిలించింది. పాకిస్తాన్ లో 15లక్షలు ఖర్చయ్యే వైద్యాన్ని చెన్నై వైద్యులు 2లక్షలకే చేసారని, అయితే ఆ డబ్బును కూడా వెనక్కి ఇచ్చి టికెట్లు తీసి మరీ పాకిస్తాన్ కి పంపారని పాక్ దంపతులు తెలిపారు.
సరిహద్దుల నడుమ ఉన్న వైరాన్ని, హింసను చూపించే కథల కంటే ఇరు దేశాల ప్రజల మధ్య ఉన్న ప్రేమ, మానవత్వాన్ని చాటిచెప్పే కథను తెరకెక్కించాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఎలాంటి ఆయుధాలు, తెలివితేటలు లేకపోయినా కేవలం నిస్వార్థమైన మంచితనాన్నే ఆయుధంగా మలుచుకుని ఒక సామాన్యుడు పాకిస్థాన్ పసిపాపను స్వదేశానికి చేర్చేలా రాసుకున్న ఆ మానవీయ కోణమే `భజరంగీ భాయిజాన్` చిత్రాన్ని ఆల్ టైమ్ క్లాసిక్‌గా నిలబెట్టింది.







































