పిల్ల‌ల కోసం త‌ల్లి సెకెండ్ ఇన్నింగ్స్!

Bhagyashree re-entry into Bollywood

`మైనే ప్యార్ కియా` చిత్రంతో దేశవ్యాప్తంగా యువత హృదయాలను గెలుచుకున్న భాగ్యశ్రీ సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ కెమెరా ముందుకు రావడానికి త‌న  పిల్లలే ప్రధాన కారణమని తెలిపారు. పెళ్లి .. మాతృత్వం కారణంగా కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలోనే  భాగ్య శ్రీ నటనకు దూరమయ్యారు. అయితే సినిమాలను తాను ఎంతగా మిస్ అవుతున్నాననే విషయాన్ని తన పిల్లలు గుర్తించారని నటనపై తనకున్న మక్కువను కళ్లలో చూసి వారే స్వయంగా రీఎంట్రీ ఇవ్వాలని ప్రోత్సహించారని  వెల్లడించారు.

ఇటీవల మరాఠీ-హిందీ బైలింగువల్ చిత్రం `రాజా శివాజీ`లో ఛత్రపతి శివాజీ మహారాజ్ తల్లి జీజాబాయ్ పాత్రలో నటించి అద్భుతమైన విజయాన్ని అందుకున్నట్లు భాగ్యశ్రీ సంతోషం వ్యక్తం చేశారు. తన మూలాలైన మహారాష్ట్ర సంస్కృతికి సంబంధించిన చారిత్రక ప్రాజెక్ట్‌లో భాగం కావడం ఎంతో సంతృప్తినిచ్చిందని  పేర్కొన్నారు. దర్శకుడు రితేష్ దేశ్‌ముఖ్  ప్రాజెక్ట్ కోసం తీసుకున్న శ్రద్ధ, దుస్తులు , సెట్స్‌లో చూపిన నిజాయితీ సినిమాను భారీ విజయవంతం చేశాయన్నారు.

ఈ సినిమా అత్యధిక వసూళ్లు సాధించిన మరాఠీ చిత్రాల్లో ఒకటిగా నిలిచిందని తెలిపారు. నటనతో పాటు సమగ్ర ఆరోగ్య జీవనశైలి  పట్ల కూడా భాగ్యశ్రీ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు.  రెండో ఇన్నింగ్స్ తనకు మరింత సంతృప్తిని ఇస్తోందని ప్రేక్షకుల నుంచి లభిస్తున్న ఆదరణ ఎంతో ఆనందాన్నిస్తోందని  ముగించారు. మ‌రి తెలుగు సినిమా పాన్ ఇండియాలో రాణిస్తోన్న త‌రుణంలో ఇటు వైపు భాగ్య శ్రీ ఓ చూపు చేసే అవ‌కాశాలు లేక‌పోలేదు.

Bhagyashree