UPI పేమెంట్లు.. కస్టమర్‌ని పిండేసే ప్లాన్!
UPI Paymentsభారతదేశంలో డిజిటల్ విప్లవానికి ప్రతీకగా నిలిచిన ఉచిత యూపీఐ చెల్లింపుల వ్యవస్థలో ఒక కీలకమైన చట్టపరమైన మార్పునకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన `పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ యాక్ట్`సవరణల ప్రకారం...భవిష్యత్తులో ఎంపిక చేసిన పెద్ద యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండిఆర్) రుసుమును విధించడానికి వీలుగా ఒక చట్టపరమైన చట్రాన్ని రూపొందించారనే కథనాలొస్తున్నాయి. డిజిటల్ చెల్లింపుల రంగాన్ని ఆర్థికంగా నిలకడగా మార్చేందుకు.. సాంకేతిక మౌలిక వసతులను మరింత బలోపేతం చేసేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోందని కథనాలొచ్చాయి.
ఈ నూతన చట్టపరమైన ప్రతిపాదనలో అత్యంత ఉపశమనం కలిగించే అంశం ఏంటంటే.. సాధారణ వినియోగదారులపై ఎలాంటి అదనపు భారం పడదు. ప్రతిపాదిత ప్రణాళిక ప్రకారం రూ. 2,000 కంటే ఎక్కువ విలువైన లావాదేవీలు నిర్వహించే పెద్ద వ్యాపార సంస్థలపై మాత్రమే 0.3 శాతం నుండి 0.5 శాతం వరకు MDR రుసుమును విధించే అవకాశం ఉంది. వార్షిక టర్నోవర్ రూ. 1.5 కోట్లు దాటిన పెద్ద వ్యాపారులను మాత్రమే ఈ పరిధిలోకి తెచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయడంతో...చిన్న దుకాణదారులు... కిరాణా వ్యాపారులకు ఉచిత చెల్లింపుల సేవలు యథావిధిగా కొనసాగుతాయి.
గత కొన్నేళ్లుగా రూపాయి కూడా రుసుము లేకుండా ఉచితంగా సేవలందించడం వల్ల ఫిన్‌టెక్ సంస్థలకు, బ్యాంకులకు మైంటెనెన్స్- నెట్‌వర్క్ భద్రతా ఖర్చులు భారంగా మారాయి. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి సంస్థలు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరచడానికి .. విస్తరించడానికి ఆదాయం లేకపోవడం ప్రతిబంధకంగా మారింది. ప్రతిపాదిత చట్టం ద్వారా పెద్ద వ్యాపారాల నుండి లభించే ఎండిఆర్ ఆదాయం, డిజిటల్ చెల్లింపుల రంగానికి - ఫిన్‌టెక్ సంస్థలకు సుదీర్ఘకాలంలో ఒక స్థిరమైన ఆర్థిక ఆసరాగా నిలవనుంది.
ఆర్థిక విశ్లేషణల సంస్థ `జెఫరీస్` గణాంకాల ప్రకారం.. వర్తక యూపీఐ లావాదేవీల పరిమాణంలో రూ. 2,000 కంటే ఎక్కువ విలువైన లావాదేవీలు కేవలం 4 శాతం మాత్రమే ఉన్నా సేకరించే మొత్తం విలువలో ఇవే ఏకంగా 67 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఈ శ్రేణిపై ఎండిఆర్ రుసుమును వర్తింపజేస్తే.. డిజిటల్ చెల్లింపుల పరిశ్రమకు ఏటా సుమారు రూ. 5,000 కోట్ల నుండి రూ. 10,000 కోట్ల వరకు అదనపు ఆదాయం లభించే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.







































