మొత్తానికి వివాహం వీళ్లకీ బాగానే కలిసొచ్చిందే!
Akhil-Kiran Abbavaram-Naga Chaitanyaటాలీవుడ్ తెరపై కొత్త సెంటిమెంట్ బలంగా వినిపిస్తోంది. ఒకప్పుడు పెళ్లి తర్వాత స్టార్స్ క్రేజ్ తగ్గుతుందని భావించేవారు. కానీ ఇప్పుడు దానికి భిన్నంగా మ్యారేజ్ సెంటిమెంట్ హీరోల కెరీర్‌కు ఊతాన్నిస్తోంది. కెరీర్ పరంగా సతమతమవుతున్న యువ హీరోలు వివాహ బంధంలోకి అడుగుపెట్టిన వెంటనే బ్లాక్ బస్టర్ విజయాలను అందుకోవడం ఆసక్తికరంగా మారింది. ఇది యాదృచ్ఛికం కాదని వ్యక్తిగత జీవితంలో స్థిరత్వం రావడం వల్లే సినిమాలపై మరింత దృష్టి పెట్టగలుగుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.
అఖిల్ అక్కినేని , కిరణ్ అబ్బవరం పేర్లు ప్రముఖంగా కనిపిస్తున్నాయి. `ఏజెంట్` వంటి భారీ పరాజయంతో తీవ్ర నిరాశలో ఉన్న అఖిల్ వివాహం తర్వాత వచ్చిన `లెనిన్` చిత్రంతో బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చారు. అలాగే వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న సమయంలోనే కిరణ్ వివాహం చేసుకున్నారు. ఆ వెంటనే విడుదలైన `క` సినిమా భారీ వసూళ్లతో కిరణ్ కెరీర్‌ను మలుపు తిప్పింది. ఇద్దరి సక్సెస్ ఇప్పుడు ఇతర యువ హీరోలకు కూడా కొత్త ఆశలను రేకెత్తిస్తోంది.
అక్కినేని నాగ చైతన్య విషయంలో కూడా ఇదే జరిగింది. శోభిత ధూళిపాళ్లతో వైవాహిక జీవితాన్ని ప్రారంభించిన తర్వాత ఆయన నటించిన `తండేల్` చిత్రం చైతూ కెరీర్‌కు మైలురాయిగా నిలిచి సాలిడ్ కంబ్యాక్‌ని అందించింది. వైవాహిక బంధం వ్యక్తిగత జీవితంలో ఇచ్చే మానసిక ప్రశాంతత, వారి పనితీరుపై సానుకూల ప్రభావం చూపుతోందనడానికి ఈ విజయాలే నిదర్శనం. స్టార్ హీరోలు తమ ప్రాధాన్యతలను సరిగ్గా సెట్ చేసుకోవడానికి పెళ్లి పునాదిగా మారుతోందని చెప్పక తప్పదు.
మొత్తంగా టాలీవుడ్‌లో వివాహం అనేది వ్యక్తిగత వేడుక మాత్రమే కాదు. కెరీర్ పరంగా కూడా సక్సెస్ ఫార్ములాగా మారుతోంది. పెళ్లి తర్వాత జీవితంలో వచ్చిన స్థిరత్వం, బాధ్యత , కొత్త ఉత్సాహం.. హీరోల ఎంపికలలో , నటనలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇలా సెంటిమెంట్‌గా మొదలైన పెళ్లి కళ టాలీవుడ్‌లో మరింత మంది స్టార్స్‌కు కలిసిరావాలని అభిమానులు ఆశిస్తున్నారు.







































