`జైలర్` విలన్ పై మరో కేసు!
Another case against the Jailer villain!
`జైలర్`, `మార్కో` వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన మలయాళ నటుడు వినాయకన్ మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. ఎనిమిదేళ్ల మైనర్ బాలిక ఫోటోను సోషల్ మీడియాలో అనుమతి లేకుండా ప్రచురించారనే ఆరోపణలతో ఆయనపై మావేలికర పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక వ్యక్తి తనకు పంపిన వాట్సాప్ సందేశంపై కక్షతో ఆ వ్యక్తి వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్‌గా ఉన్న అతని చిన్నారి కుమార్తె ఫోటోను, ఆ వ్యక్తి ఫోన్ నంబర్‌తో సహా వినాయకన్ తన వెరిఫైడ్ ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ ఘటనతో కుటుంబ సభ్యలు పరువు నష్టం దావా వేసారు. వినాయకన్ పోస్ట్ చేసిన ఫోన్ నంబర్ తనదేనని భావించిన పలువురు వ్యక్తులు, బాధితుడికి ఫోన్ చేసి అసభ్య పదజాలంతో దూషించడంతో పరిస్థితి మరింత దిగజారింది. బాధితుడు కేరళ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్‌ను ఆశ్రయించడంతో కమిషన్ ఆదేశాల మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
నటుడిగా మంచి గుర్తింపు ఉన్నా? వినాయకన్ తరచుగా ఇలాంటి వివాదాలతో వార్తల్లో నిలవడం గమనార్హం. గతంలోనూ వినయకన్ మద్యం మత్తులో బహిరంగంగా గొడవ పడటం, ఎయిర్‌పోర్టులో సిబ్బందితో వాగ్వాదానికి దిగడం వంటి ఘటనలతో వార్తల్లో నిలిచారు. తాజాగా మైనర్ బాలికకు సంబంధించిన సున్నితమైన అంశంలో కేసు నమోదు కావడంతో ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పలు వర్గాల నుంచి డిమాండ్లు వస్తున్నాయి.







































