Advertisement

రివ్యూవర్లు సామాన్యుడి జేబుకు రక్షణ కవచాలు!!

Movie Reviews

ఇటీవలి కాలంలో చిత్ర పరిశ్రమలో సినిమా రివ్యూలు .. బాక్సాఫీస్ వద్ద వాటి ప్రభావంపై తీవ్రమైన చర్చ నడుస్తోంది. సినిమా విమర్శకుల వల్లే చిత్రాలు పరాజయం పాలవుతున్నాయని, వారు సోషల్ మీడియాలో ప్రతికూల ప్రచారాన్ని వ్యాప్తి చేస్తూ ప్రేక్షకులను థియేటర్లకు రాకుండా అడ్డుకుంటున్నారని పలువురు అగ్ర నటులు, నిర్మాతలు బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే థియేటర్లలో విపరీతంగా పెరిగిన టికెట్ ధరలు, ఓటీటీల విస్తృతి వల్లే జనాలు రావడం లేదనే మరో వాదన కూడా పరిశ్రమలో బలంగా వినిపిస్తోంది. ఈ హాట్ టాపిక్‌పై టాలీవుడ్  దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందిస్తూ సరికొత్త సంచలనానికి తెరలేపారు.

రామ్ గోపాల్ వర్మ విశ్లేషణ ప్రకారం సినిమా రివ్యూవర్లు చిత్ర పరిశ్రమ ప్రయోజనాల కోసం పనిచేసేవారు కాదు. వారు పూర్తిగా ప్రేక్షకుల పక్షాన నిలిచేవారని స్పష్టం చేశారు. ఏదైనా ఒక సినిమా బాలేనప్పుడు, ప్రేక్షకులు తమ కష్టార్జితాన్ని ,విలువైన సమయాన్ని వృథా చేసుకోకుండా ముందుగానే విమర్శకులు హెచ్చరించడం అనేది ఒక రకమైన ప్రజాసేవ తో సమానమని  అభిప్రాయపడ్డారు. పరిశ్రమ వ్యాపారాన్ని కాపాడటం సమీక్షకుల బాధ్యత కాదని, సామాన్య సినిమా అభిమాని ప్రయోజనాలను రక్షించడమే వారి అసలు పని అని వర్మ తేల్చి చెప్పారు.

ప్రస్తుత రోజుల్లో థియేటర్ టికెట్ల ధరలతో పాటు అక్కడ విక్రయించే తినుబండారాల  రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోయాయని ఆర్జీవీ గుర్తుచేశారు. ఒక మధ్యతరగతి కుటుంబం సినిమా చూడాలంటే భారీగా ఖర్చు పెట్టాల్సి వస్తున్న తరుణంలో ఈ రివ్యూలు సామాన్య ప్రేక్షకుడి జేబుకు రక్షణ కవచంలా ఉపయోగపడుతున్నాయని కొనియా డారు. అందువల్ల సినిమా నచ్చకపోతే రివ్యూల వల్ల ఫ్లాప్ అయిందని నిర్మాతలు బాధ‌ప‌డ‌టం మానేసి తమ చిత్రాల్లోని కంటెంట్‌ను ఎలా మెరుగుపరుచుకోవాలో చూసుకోవాల‌ని  చేసిన వ్యాఖ్యలు నెట్టింట‌  వైరల్ గా మారాయి. 

Review Writers