నేటి ఆధునిక యుగంలో ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఎయిర్ కండిషనర్లు (AC) అనివార్యంగా మారాయి. అయితే పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఏసీల వినియోగం పర్యావరణానికి శాపంగా మారుతోంది. ఏసీల నుంచి వెలువడే గ్రీన్‌హౌస్ వాయువులు వాతావరణాన్ని మరింత వేడిక్కిస్తుండగా.. మరోవైపు విపరీతమైన కరెంటు బిల్లులు సామాన్యుల జేబులకు చిల్లులు పెడుతున్నాయి. దీనికి తోడు ఏసీ గాలి వల్ల కీళ్ల నొప్పులు, శ్వాసకోశ ఇబ్బందులు వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారంగా భారతదేశపు 3000 ఏళ్ల నాటి ఒక అద్భుతమైన సహజ రీతి కూలింగ్ (శీతలీకరణ) పద్ధతి ఇప్పుడు మళ్లీ వెలుగులోకి వచ్చింది.
సింధు లోయ నాగరికత కాలం నుంచే భారతీయులు వేడిని తట్టుకునేందుకు వినూత్నమైన నిర్మాణ శైలిని అవలంబించేవారు. ఇందులో ప్రధానంగా టెర్రకోట గొట్టాల (మట్టి గొట్టాలు) వినియోగం ఎంతో కీలకం. భవనాల గోడలు, పైకప్పుల మధ్య ఈ మట్టి గొట్టాలను అమర్చడం ద్వారా అద్భుతమైన థర్మల్ ఇన్సులేషన్ లభిస్తుంది. ఇవి బయటి వేడిని లోపలికి రానివ్వకుండా గాలిని బంధిస్తాయి. ప్రజామోదయోగ్యమైన ఈ ప్రాచీన టెక్నిక్ ను పాటించడం వల్ల ఇంటి లోపల ఉష్ణోగ్రతను ఏకంగా 50 శాతానికి సహజంగా తగ్గించవచ్చని ఇటీవలి అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. రాజస్థాన్‌లోని జైపూర్ వంటి నగరాల్లోని పురాతన కోటలు నేటికీ ఎండకాలంలో ఎంతో చల్లగా ఉండటానికి ఇదే ప్రధాన కారణం. అంతేకాదు .. మన పూర్వీకులు నిర్మించిన పెంకుల ఇంటి నిర్మాణం కూడా ఇండ్లను ఎంతో కూల్ గా ఉంచడం మనకు తెలిసినదే.
అయితే ఈ విధానంలో కేవలం మట్టి గొట్టాలే కాకుండా నిర్మాణ శైలిలో కూడా కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. ఎత్తైన పైకప్పులు, మందపాటి గోడలు.. సరైన గాలి ప్రసరణ ఉండేలా కిటికీలతో అమరిక ఉంటుంది. వేడి గాలి పైకి వెళ్లేలా.. చల్లటి గాలి లోపలికి వచ్చేలా చేసే ఈ సహజ వాయు ప్రసరణ అధునాతన కాలుష్య కారకమైన `ఏసీ`ల అవసరాన్ని పూర్తిగా తగ్గిస్తుంది. దీని కోసం స్థానికంగా లభించే మట్టి, సున్నం, ఇటుకలు వంటి సహజ వనరులనే ఉపయోగిస్తారు. ఇది పర్యావరణానికి మేలు చేయడమే కాకుండా.. విద్యుత్ వినియోగాన్ని గణనీయంగా తగ్గించి ఆర్థిక భారాన్ని కూడా తగ్గిస్తుంది.
ఆధునిక ఏసీలు.. కూలర్ల కొనుగోలు.. వాటి నిర్వహణ ఖర్చుతో పోలిస్తే.. నిర్మాణ సమయంలోనే ఈ పద్ధతులను పాటించడం దీర్ఘకాలికంగా ఎంతో లాభదాయకం. ఒకసారి ఈ పద్ధతిలో ఇల్లు నిర్మిస్తే.. ఏటా ఏసీల మాదిరిగా సర్వీసింగ్ చేయించాల్సిన అవసరం ఉండదు. అంతేకాకుండా.. సహజ సిద్ధమైన వాతావరణంలో నివసించడం.. ఏసీ కారక అసౌకర్యాల నుంచి కూడా విముక్తి లభిస్తుంది. ప్రస్తుతం `గ్రీన్ బిల్డింగ్` కాన్సెప్ట్‌లో భాగంగా చాలా మంది ఆర్కిటెక్టులు ఈ పాత పద్ధతులను ఆధునిక నిర్మాణాల్లోకి మళ్లీ తీసుకురావడం శుభపరిణామం.
ప్రకృతితో మమేకమై జీవించడం.. భవిష్యత్ తరాలకు సురక్షితమైన పర్యావరణాన్ని అందించడం నేటి తక్షణ అవసరం. గ్లోబల్ వార్మింగ్ ముప్పును అరికట్టడానికి ఇటువంటి పర్యావరణ అనుకూల కట్టడాలను ప్రభుత్వం కూడా ప్రోత్సహించాల్సి ఉంది. పన్ను రాయితీలు లేదా ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించడం ద్వారా ప్రజలు ఈ ప్రాచీన సుస్థిర జీవనశైలి వైపు అడుగులు వేసేలా చేయవచ్చు. మన పూర్వీకులు అందించిన ఈ 3000 ఏళ్ల నాటి విజ్ఞానాన్ని ఆధునిక అవసరాలకు అనుగుణంగా మలుచుకుంటే ఏసీలు లేని చల్లటి ప్రపంచాన్ని నిర్మించుకోవడం అసాధ్యమేమీ కాదని విశ్లేషిస్తున్నారు.




ఉగ్రవాద గూఢచారి కథలకే ప్రాధాన్యమా
Loading..