దురంధర్ బ్యాచ్‌పై దావూద్ గ్యాంగ్ ప్రతీకారం

Dhurandhar Angered D-CompanyDhurandhar Angered D-Company

బాలీవుడ్ యాక్షన్ స్పై థ్రిల్లర్ `దురంధర్` చిత్రం సాధించిన అపూర్వ విజయం.. పాకిస్తాన్ నుండి నడుస్తున్న మోస్ట్ వాంటెడ్ అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు చెందిన డీ-కంపెనీ గ్యాంగ్‌కు పూన‌కాలు తెప్పించింది. రణవీర్ సింగ్ కథానాయకుడిగా ఆదిత్యాధ‌ర్ రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ బ్లాక్‌బస్టర్ ఫ్రాంఛైజీలో.. దావూద్ ఇబ్రహీం పోలికలతో ఉన్న `బడే సాహెబ్` అనే పాత్రను చావు అంచుపై ఉన్నట్లు చూపించడమే ఈ ప్ర‌తీకారానికి ప్రధాన కారణం.

తమ బాస్ ఇంకా బతికే ఉన్నాడని ప్రపంచానికి నిరూపించాలనే ఆరాటంతో డీ-కంపెనీ ఇప్పుడు ముంబైలోని తమ గ్యాంగ్ ని యాక్టివేట్ చేసి సరికొత్త ఉగ్ర కుట్రలకు తెరలేపింద‌ని పోలీస్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ ప్లాన్‌లో భాగంగా ముంబై వీధుల నుండి ఎంపిక చేసిన కొత్త సభ్యులకు ఆయుధాలు అందించి, పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ సహాయంతో ట్రైనింగ్ ఇవ్వ‌డ‌మే కాకుండా భారత్‌లో ఒక పెద్ద దాడికి లేదా ఒక శక్తివంతమైన ప్రముఖుడిని టార్గెట్ చేయడానికి ప్రణాళికలు రచించిన‌ట్టు విచార‌ణ‌లో వెల్ల‌డైంద‌ని తెలుస్తోంది.

పోలీసుల‌ విశ్లేషణల ప్రకారం.. ముంబై అండర్‌వరల్డ్‌లో బలవంతపు వసూళ్ల వ్యాపారంలో డీ-కంపెనీ ప్రాభవం రోజురోజుకూ క్షీణిస్తోంది. ఈ క్రమంలో తమ ఉనికిని చాటుకోవడానికి.. కోల్పోయిన ఇమేజ్‌ను మళ్లీ పునరుద్ధరించుకోవడానికి ఐఎస్ఐ సహాయంతో ఈ విఫల ప్రయత్నాలు చేస్తోంది.

ఇటీవల ఢిల్లీ పోలీసులు ఒక భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేసి, పాకిస్తాన్ ఐఎస్ఐ - ముంబై అండర్‌వరల్డ్ మధ్య ఉన్న బలమైన లింకును బట్టబయలు చేయడంతో ఈ సంచలన విషయాలన్నీ వెలుగులోకి వచ్చాయి. ఇలాంటి తీవ్రవాద కార్య‌క‌లాపాల‌కు పాకిస్తాన్ కేంద్రంగా ఉన్నా.. భారతీయ నిఘా సంస్థలు డి గ్యాంగ్ వ్యూహాన్ని తిప్పికొట్ట‌డంపై ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి.
 

Underworld don Dawood Ibrahim's D-company has activated the Mumbai network