దోపిడీ సొమ్ములో జగన్ వాటా ఎంత
GV Anjaneyulu Fires On YS Jagan Mohan Reddy
వైసీపీ నేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వాన్ని ప్రజల ముందు బ్యాడ్ చెయ్యాలని ఎన్నో ఎత్తులు వేస్తున్నా దానిని టీడీపీ నేతలు చిత్తు చేస్తున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు విఘాతం కలిగించేలా జగన్ మోహన్ రెడ్డి ప్రవర్తిస్తున్నారు అంటూ టీడీపీ నేత, ఎమ్యెల్యే ఆంజనేయులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
నంద్యాలలో వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసి మళ్లీ ఏమి తెలియనట్టు నాటకాలాడుతున్నారు. వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసి ఘటన వెనుక వైసిపి నాయకులే ఉన్నారని, కావాలనే ఈ విధ్వంసానికి ఒడిగట్టి, రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకు వారు ప్లాన్ చేసారు అంటూ ఆంజనేయులు విమర్శించారు.
ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో కులాలు, వర్గాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందడమే జగన్ మోహన్ రెడ్డి ప్రధాన ఎజెండా అంటూ ఆయన ఫైర్ అయ్యారు. ప్రస్తుత ప్రభుత్వ అభివృద్ధిని చూసి ఓర్వలేకే జగన్ విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
అంతేకాకుండా బ్రాహ్మణపల్లి పంచాయతీ పరిధిలోని రెండెకరాల భూమిని వైసిపి నేతలు అక్రమంగా ఆక్రమించారని ఎమ్మెల్యే ఆంజనేయులు ఆరోపించారు. ఈ దోపిడీ సొమ్ములో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాటా ఎంతో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. వైసీపీ కాబట్టి అక్రమం గా సొమ్ము దోపిడీ చేస్తున్నా జగన్ ఊరుకుంటున్నారు కానీ టిడిపిలో ఇలాంటి అక్రమాలకు పాల్పడితే తక్షణమే బహిష్కరిస్తారని, కానీ వైసిపిలో అవినీతికి అండగా నిలుస్తారని విమర్శించారు.
వినుకొండ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు భారీ అక్రమాలకు పాల్పడ్డారని, కోర్టు పరిధిలో ఉన్న భూమిని కొల్లగొట్టేందుకు దొంగ జీవోలను సృష్టించారని, తద్వారా సుమారు రూ. 1500 కోట్ల ప్రజాధనాన్ని దోచుకునేందుకు కుట్ర పన్నారని తెలిపారు. ఈ బండారం బయటపడటంతోనే ఆయన పరారయ్యారని.. ఇలాంటి ఫ్రాడ్ నేతలను జగన్ ఏం చేస్తారు అంటూ ఆంజనేయులు ప్రశ్నించారు.







































