ఇటీవలి కాలంలో క్రాస్ కల్చర్ సినిమాల వెల్లువ భారతదేశంలో పెరుగుతోంది. ముఖ్యంగా ఉత్తరాది-దక్షిణాది ఆడియెన్ ని కలిపేందుకు, అభిరుచి మార్పిడికి కొన్ని ప్రయత్నాలు సాగుతున్నాయి. బాలీవుడ్ లో వచ్చిన చెన్నై ఎక్స్ ప్రెస్, పరమ్ సుందరి లాంటి చిత్రాలు ఈ కేటగిరీనే. అయితే ఇది కేవలం దేశంలో అంతర్గతంగా రెండు విభిన్న భాషల నుంచి విభిన్న సంస్కృతుల ప్రజలను కలిపే ప్రయత్నం.
కానీ రెండు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలను మెరుగుపరచడం ద్వారా ఇరువైపులా కల్చర్ మార్పిడి ప్రక్రియకు సినిమా సహకారిగా మారాలని ఇటీవల ప్రజలు కోరుకుంటున్నారు. ఆ రకంగా చూస్తే, ఇప్పటికే అమెరికన్లు మెచ్చే సినిమాలను భారతీయ ఫిలింమేకర్స్ తెరకెక్కిస్తున్నారు. అటు బ్రిటన్ తోను సత్సంబంధాలు కొనసాగించేందుకు ఇప్పుడు యష్ రాజ్ ఫిలింస్ లాంటి సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఈ సంస్థ దశాబ్ధాల క్రితం నిర్మించిన దిల్ వాలే దుల్హానియా లేజాయేంగే (డిడిఎల్‌జే) ఒక సంచలనం.
ఈ ప్రేమకథా చిత్రం బ్రిటన్ లొకేషన్లలో తెరకెక్కింది. ఇప్పుడు ఇదే నిర్మాణ సంస్థ యూకే ప్రభుత్వంతో మూడు సినిమాల బిగ్ డీల్ కుదుర్చుకుంది. ఈ డీల్ కారణంగా యూకేలో 3000 ఉద్యోగాలు పెరుగుతాయని యూకే ప్రధాని కీర్ స్టేట్‌మెంట్ ఇవ్వడం ఆసక్తిని కలిగిస్తోంది. భారతీయ సినీపరిశ్రమతో సత్సంబంధాలు కొనసాగించేందుకు ఆయన ఆసక్తిని కనబరిచారు. భారత్ - యూకే క్రాస్ కల్చర్ పై సినిమాలు రావాలని, ఇరు దేశాల మధ్య సాంస్కృతికంగా అవినాభావ సంబంధం కలిగి ఉండాలని కూడా కీర్ ఆకాంక్షించారు.
నిజానికి భారతీయ సినిమాలకు బ్రిటన్ లోను ఆదరణ ఉంది. కానీ సాంస్కృతిక వైరుధ్యాలను తగ్గించడం లేదా తొలగించడం ద్వారా మరింతగా దేశీ సినిమా యూకేలో దూసుకెళ్లేందుకు ఛాన్సుంటుంది. దీనికోసం క్రాస్ కల్చర్ సినిమాలను భారతీయ ఫిలింమేకర్స్ తెరకెక్కించాల్సి ఉంటుంది. భారతీయ సినిమాలను బ్రిటన్ లో తెరకెక్కించేందుకు అన్నివిధాలా అక్కడి ప్రభుత్వం సహకరించేందుకు సిద్ధంగా ఉందని ఆ దేశ ప్రధాని కీర్ వ్యాఖ్యానించడం ఆసక్తికరం.