రిషబ్ శెట్టి నటించిన ప్రీక్వెల్ సినిమా కాంతార చాప్టర్ 1 అక్టోబర్ 2న దసరా కానుకగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని అన్ని ప్రధాన మెట్రో నగరాల్లో రిషబ్ ప్రమోట్ చేస్తున్నారు. అయితే హైదరాబాద్ లో జరిగిన భారీ ప్రచార వేదికపై రిషబ్ తెలుగు మాట్లాడకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముంబై వెళితే హిందీ మాట్లాడాడు.. చెన్నై వెళ్లి తమిళం మాట్లాడాడు. కానీ హైదరాబాద్ వచ్చి తెలుగు మాట్లాడకపోతే ఎలా? అంటూ కొందరు తప్పు పట్టారు.
హైదరాబాద్ లో జరిగిన ప్రీరిలీజ్ లో రిషబ్ శెట్టి పూర్తిగా కన్నడలోనే ప్రసంగించారు. ఇది తెలుగు ప్రేక్షకులకు అస్సలు నచ్చలేదు. దీంతో వెంటనే విమర్శలు వచ్చాయి. తెలుగులో కొన్ని పదాలు అయినా గుర్తు లేవా? కన్నడం తెలుగు భాషకు చాలా దగ్గరగా ఉంటుంది. యాక్సెంట్ సమస్య కూడా ఉండదు! అంటూ చాలా మంది విశ్లేషించారు.
హైదరాబాద్ ఈవెంట్లో కనీసం తెలుగు మాట్లాడకపోయినా ఇంగ్లీష్ కూడా అతడు మాట్లాడలేదని కొందరు వేలెత్తి చూపించారు. అది రిషబ్ శెట్టి గారి అహంకారం. హిందీలో ఇంటర్వ్యూలు ఇవ్వడానికి ఆయనకు ఎలాంటి ఇబ్బంది లేదు. కనీసం తెలుగులో కొన్ని పదాలు ప్రయత్నించి ఉండాల్సింది! అని ఒక యూజర్ రాశారు. రిషబ్ తెలుగులో ఒక్క వాక్యాన్ని కూడా ప్రయత్నించకపోవడం నిరాశపరిచింది. తెలుగు ప్రేక్షకులు మొదటి భాగాన్ని భారీ పాన్ ఇండియా హిట్‌గా మార్చారు.. మేం ప్రాథమిక గౌరవానికి అర్హులం.. అని ఒకరు రాసారు.
టికెట్ ధరలు ఎందుకు పెంచాలి?
డబ్బింగ్ చేసిన తెలుగు వెర్షన్ కోసం టికెట్ ధరల పెంపుపైనా వివాదం ముదిరింది. కొన్ని థియేటర్లు అసలు కన్నడ విడుదలతో సమానమైన ప్రీమియం ధరలను వసూలు చేస్తున్నాయని, టికెట్ దోపిడీ పై ఆరోపణలు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రజలను గౌరవించాలని, టికెట్ ధర పెంచాలనుకున్నప్పుడు కనీసం తెలుగు మాట్లాడాలని కొందరు పట్టుబట్టారు. పొరుగువారి కంటే భాష సంబంధిత విషయాల్లో ఎక్కువగా రిలాక్స్ డ్ గా కనిపించే తెలుగు ప్రేక్షకుల నుండి దీనికి తీవ్రంగా స్పందించడం చాలా అరుదైనది. ప్రస్తుతం #BoycottKantaraChapter1 హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. తెలుగు భాషను ఎందుకు స్కిప్ కొట్టాడో రిషబ్ చెప్పాలి. లేదా అభిమానులకు శెట్టి క్షమాపణ చెప్పాలి.. లేదా వివరణ ఇవ్వాలి అన్న వాదన మొదలైంది.