నటి శిల్పాశెట్టి భర్త, ప్రముఖ సినీ నిర్మాత రాజ్ కుంద్రాపై మరోసారి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తీవ్ర ఆరోపణలు చేసింది. ఓ వైపు 60 కోట్ల విలువ చేసే ఆర్థిక నేరం విషయంలో అతడిపై ఇప్పటికే విచారణ కొనసాగుతోంది. ఇదే సమయంలో అతడు దాదాపు 150 కోట్ల విలువ చేసే బిట్ కాయిన్ స్కామ్ లో నేరస్తుడు! అంటూ ఈడీ ఆరోపించడం సంచలనమైంది. ఈ స్కామ్ లో శిల్పాశెట్టి ప్రమేయం గురించి కూడా ఈడీ వ్యాఖ్యలు హాట్ టాపిగ్గా మారాయి. ఏడేళ్ల పాటు సాగిన ఈ బిట్ కాయిన్ దందాలో రాజ్ కుంద్రాకు 285 బిట్ కాయిన్లు అందాయని ఈడీ అధికారులు ఆరోపిస్తున్నారు.
కుంద్రా ఈ కాయిన్ లకు యజమాని అయినా కానీ నేను కేవలం మధ్యవర్తిని అంటూ బుకాయించేందుకు ప్రయత్నిస్తున్నాడని ఈడీ వ్యాఖ్యానించింది. బిట్ కాయిన్ లావాదేవీలకు సంబంధించిన సమస్త సమాచారాన్ని కుంద్రా నాశనం చేసేందుకు ప్రయత్నించాడు. అతడు తన ఐఫోన్ ని ధ్వంశం చేయడం నేరపూరితమైనది అని ఈడీ వ్యాఖ్యానించింది. బిట్ కాయిన్ వ్యాపారంతో ముడిపడిన మనీ లాండరింగ్ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేస్తున్న ఎన్ ఫోర్స్ మెంట్, కుంద్రా ఏ మార్గంలో స్కామ్ కి పాల్పడ్డాడో వివరించేందుకు ప్రయత్నించింది. ఈ స్కామ్ లో దివంగత స్కామ్ స్టర్ అమిత్ భట్టాచార్య పేరు కూడా వినిపించింది.
భట్టాచార్య నుంచి కుంద్రా ఈ కాయిన్ లు అందుకున్నాడనేది ఈడీ ఆరోపణ. కానీ బిట్ కాయిన వాలెట్ చిరునామాలతో పాటు కీలక ఆధారాలను అతడు బయటకు దొరక్కుండా దాచిపెట్టాడని ఈడీ ఆరోపిస్తోంది. ఇప్పటికే మరణించిన భరద్వాజ్ ఫ్యామిలీ కి చెందిన కంపెనీలపై దిల్లీ పోలీసులు విచారణ జరుపుతున్న క్రమంలో కుంద్రా మనీలాండరింగ్ వ్యవహారంపైనా కేసు నమోదు అయింది. తాను ఎలాంటి తప్పు చేయలేదని నిరూపించేందుకు కుంద్రా తప్పు మీద తప్పు చేస్తున్నాడని కూడా ఈడీ గుర్తించినట్టు వెల్లడించింది.