`దేవదాస్` మొదలు మొన్నటి `సయ్యారా` వరకూ మగ బాధితుడి కథలు అయితేనే భారతీయ ప్రజలు హిట్లు ఇస్తారు! మొదటి నుంచి పరిశీలనగా చూడండి.. మీకు మన భారతీయ సినిమా కథల్లో ఇది స్పష్ఠంగా కనిపిస్తుందని చెబుతోంది మేటి నటి స్వరా భాస్కర్. తన వివాదాస్పద వైఖరితో ప్రతిసారీ మీడియా హెడ్ లైన్స్ లోకి వస్తున్న స్వరా, ఇప్పుడు మగ బాధితుల గురించి ప్రస్థావించింది.
దేవదాస్‌లో ఆడదాని వల్లనే మగాడు తాగుబోతు అవుతాడు.. ఆ కథ అందరికీ నచ్చింది. మొన్న సయ్యారా కథ చూస్తే, అతడు ఆమెను పిచ్చిగా ప్రేమిస్తే, ఆమె వేరొకరి పేరు చెబుతుంది! అందువల్ల మగ బాధితుడి కథ ప్రజలకు నచ్చింది. రాంజానా సినిమాలోను పేదవాడు చివరికి చనిపోతాడు.. అంటే పేద ప్రేమికుడు బాధితుడు అన్నమాటే! అంటూ స్వరా వ్యంగ్యంగానే స్పందించింది. ధనుష్ కథానాయకుడిగా నటించిన రాంజానా చిత్రంలో సోనమ్ కపూర్, స్వరా భాస్కర్ కీలక పాత్రల్లో నటించిన సంగతి తెలిసిందే.
మేల్ డామినేటెడ్ ప్రపంచాన్ని సూటిగా విమర్శించే స్వరాభాస్కర్ ఇప్పుడు భారతీయ సినిమా కథలపై తనదైన శైలిలో విరుచుకుపడింది. ఇలా సూటిగా విమర్శిస్తుంది గనుకనే స్వరా భాస్కర్ కి ఇటీవల అవకాశాలు తగ్గిపోయాయి. దర్శకనిర్మాతలు ఎవరూ పిలిచి అవకాశాలివ్వడం లేదని తనే స్వయంగా అంగీకరించింది. ఇటీవల పెళ్లితో లైఫ్ లో సెటిలైన స్వరా పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.