నటీనటులకు క్రమశిక్షణ చాలా ముఖ్యం. షూటింగులకు సమయానికి వచ్చి సహకరించే తారలకు దక్కే గౌరవం ఇతరులకు ఉండదు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసే నిర్మాతను కొంతైన సురక్షితంగా ఉంచాల్సిన బాధ్యత నటీనటులకు ఉంది. అలా కాకుండా నిర్మాతను ముంచాలనుకుంటే దాని పర్యవసానం కూడా అంతే తీవ్రంగా ఉంటుంది.
అయితే స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌పై వరుస పెట్టి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకుముందు అభినవ్ కశ్యప్ లాంటి డైరెక్టర్ సల్మాన్ అసలు నటుడే కాదు..! అని విమర్శించాడు. అంతకుముందే `సికందర్` దర్శకుడు ఏ.ఆర్.మురుగదాస్ కూడా సల్మాన్ క్రమశిక్షణా రాహిత్యం గురించి కామెంట్ చేసాడు. సల్మాన్ సెట్స్ పైకి ఆలస్యంగా వచ్చేవాడని, అతడి కోసం ఎదురు చూపులు చూడాల్సి వచ్చిందని అన్నాడు.
ఇప్పుడు ఓ రియాలిటీ షోలో మాట్లాడుతూ అమీర్ ఖాన్ ఇంచుమించు అదే వ్యాఖ్య చేసాడు. సల్మాన్ ఖాన్ తో `అందాజ్ ఆప్నే ఆప్నే` సినిమాలో నటించేప్పుడు సెట్స్ కి అతడు ఆలస్యంగా వచ్చేవాడని, అతడు వచ్చేప్పటికి 12 అయ్యేదని, వచ్చిన తర్వాత కూడా నిదురపోయేవాడని ఆరోపించాడు అమీర్. అతడిని లేపి రిహార్సల్స్ కి పిలిచేవాడిని అని కూడా అమీర్ అన్నాడు.
అయితే అమీర్ ఖాన్ ఏడాదికి ఒకే సినిమాలో నటిస్తుంటే, తాను 15 సినిమాల్లో నటించేవాడిని అని దానివల్ల తీవ్రమైన స్ట్రెస్ కి గురై అలసిపోయి నిదురించేవాడిని అని సల్మాన్ తన బాధను కూడా చెప్పుకొచ్చారు.