ఇది వినడానికి విచిత్రంగా ఉన్నా కానీ ఇదే నిజం. ఇది ఒక వాస్తవ కథ. ప్రముఖ నిర్మాత బోనీకపూర్ నిజ జీవితంలో జరిగిన కథ. అతడు 90లలో ప్రముఖ కథానాయిక శ్రీదేవిని సీక్రెట్ గా పెళ్లాడిన సంగతి తెలిసిందే. శ్రీదేవితో అతడికి ఇద్దరు పిల్లలు జాన్వీ, ఖుషి ఉన్నారు. అయితే అప్పటికే పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్న బోనీకపూర్.. శ్రీదేవిని ఎలా పెళ్లాడాడు? అంటే... అతడు ఇటీవల చెప్పిన ఓ కథ వింటే కచ్ఛితంగా తన మొదటి భార్య అనుమతితోనే చేసుకున్నాడని భావించాల్సి ఉంటుంది.
అతడు శ్రీదేవిని ప్రేమించిన విషయాన్ని ఇంట్లో ఏనాడూ దాచలేదు. అతడు తన మొదటి భార్య మోనాకు చెబుతూనే ఉన్నారు. అయితే తన భర్త శ్రీదేవిని ప్రేమిస్తున్న విషయం తెలిసి కూడా, ఆ ఇద్దరి పెళ్లికి మోనా ఉంగరాలు కూడా చేయించి ఇచ్చిందని బోనీకపూర్ చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తాజా పాడ్ కాస్ట్ లో బోనీ చెప్పిన ఈ విషయం నిజంగా షాకిస్తోంది. అతడు తన ఉంగరాన్ని, శ్రీదేవి చేతి వేలికి ఉన్న ఉంగరాన్ని కూడా ఇప్పుడు చూపించాడు. ఇవి రెండూ మోనా కొనుగోలు చేసి ఇచ్చిందని చెప్పడం ఆశ్చర్యపరుస్తోంది. తనకు ఇద్దరు పిల్లలు ఉన్నా కానీ శ్రీదేవి కోసం తాను ఇల్లు విడిచి వెళ్లానని కూడా బోనీ చెప్పాడు.
దానికి కారణం కూడా ఆసక్తికరం. శ్రీదేవి తల్లిదండ్రులు అప్పటికే చనిపోయారు. తను ఒంటరి అయింది. దీంతో తనను వదిలి ఉండలేకపోయానని బోనీ చెప్పారు. తను ఇల్లు విడిచి వెళ్లిపోవడంతో తన కుమారుడు అర్జున్ ఆవేదనగా ఒక లేఖ కూడా రాసాడు. ఆ లేఖలో నాన్న మీరు ఇంటికి ఎందుకు రాకూడదు? అని ప్రశ్నించాడట. అది తనను ఎంతగానో బాధించిందని బోనీ చెప్పాడు. అయితే తండ్రిని ద్వేషించమని తన పిల్లలకు మోనా కపూర్ ఎప్పుడూ నూరి పోయలేదని, ఆ విషయంలో తాను ఎంతో ధన్యుడిని అని కూడా బోనీ చెప్పాడు. పరిస్థితులు ఆడిన వింత నాటకంలో తాను అలా చేయాల్సి వచ్చిందని బోనీ చెప్పుకొచ్చాడు కానీ, తాను తప్పు చేసానని మాత్రం అంగీకరించలేదు!.. ప్చ్!!