నాలుగేళ్ల క్రితం కింగ్ ఖాన్ షారూఖ్ వారసుడు ఆర్యన్ ఖాన్ ని క్రూయిజ్ షిప్ పార్టీలో నార్కోటిక్స్ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. పార్టీలో ఆర్యన్ డ్రగ్స్ సేవించాడని, పెడ్లర్స్ తో సంబంధాలు కలిగి ఉన్నాడని ఎన్సీబీ అధికారి సమీర్ వాంఖడే ఆరోపించారు. ఆరోజు ఆర్యన్ ని అతడితో పాటు ఉన్న స్నేహితులను కూడా సమీర్ వాంఖడే అరెస్ట్ చేసారు.
అయితే ఈ కేసు నుంచి బయటపడిన ఆర్యన్ ఖాన్ ఇప్పుడు రివెంజ్ మోడ్ లో ఉన్నాడనేది సమీర్ వాంఖడే ఆరోపణ. ఇటీవలే ఆర్యన్ దర్శకత్వం వహించిన `ది బాడ్స్ ఆఫ్ బాలీవుడ్` వెబ్ సిరీస్ లో తనను టార్గెట్ చేస్తూ కొన్ని సీన్లను తెరకెక్కించాడని 2 కోట్ల పరువు నష్టం దావా వేసారు వాంఖడే. ఈ కేసుపై దిల్లీ కోర్టులో విచారణ సాగుతోంది. బాలీవుడ్ సెలబ్రిటీలపై సెటైరికల్ డ్రామా కథాంశంతో రూపొందించిన ఈ సిరీస్ లో కొన్ని సీన్లలో తనను కించపరిచే విధంగా చూపించారని వాంఖడే ఆరోపించారు.
ఉద్ధేశపూర్వకంగా ఆర్యన్ ఈ పాత్రను సృష్టించాడని వాంఖడే వ్యాఖ్యానించారు. ఈ వెబ్ సిరీస్ ని నెట్ ఫ్లిక్స్ నుంచి శాశ్వతంగా తొలగించాలని, తనకు 2 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని కూడా వాంఖడే డిమాండ్ చేసారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడే అధికారులకు ఇది అవమానకరమని కూడా వాంఖడే వ్యాఖ్యానించారు.