కొందరు వేదికలు ఎక్కితే మాట్లాడే శైలికి వినేవారికి ఒణుకు పుడుతుంది. అది భయంతో కూడుకున్న ఒణుకు కాదు... ఏహ్య భావంతో కూడుకున్న ఒణుకు. ఇదేమి స్పీచ్ రా బాబూ! అని తలలు బాదుకుంటారు. ఒక్కోసారి పది మంది పెద్దల మధ్య నించుని మాట్లాడుతున్నాం! అనేది కూడా మర్చిపోయి మాట్లాడే పెద్ద నాయకులు (హీరో కూడా) చాలా కామెడీలే చేస్తుంటారు. ఇప్పుడు ఇండస్ట్రీకి చెందిన ఒక ప్రముఖ కథానాయకుడు, శాసన సభ్యుడు వేదికపై తడబడుతూ మాట్లాడిన తీరు.. పరిశ్రమ సహచరుడిని అగౌరవపరుస్తూ మాట్లాడిన తీరు అభిమానుల్లో చర్చకు వచ్చింది. దీనికి అసెంబ్లీలో వెనకాల సీట్లలో కూచున్న రాజకీయ పెద్దలంతా చప్పట్లు కొట్టినా కానీ, ఆ సమయంలో ఆ హీరోగారు మాట్లాడినది టీవీ చానెల్ లైవ్ లో చూస్తున్న ప్రజలు కానీ, ఇండస్ట్రీ జనం కానీ జీర్ణించుకోలేకపోయారు.
వేలాది మంది టీవీ చానెళ్లలో వీక్షిస్తున్న సమయంలో శాసనసభ్యుడైన సహచర కథానాయకుడి సంభాషణా చాతుర్యం పూర్తిగా ఎదుటివారి మనసును గాయపరిచేలా ఉంది. తన మనసును గాయపరిచినా కానీ, దానికి వివరణ ఇస్తూ రాసిన లేఖలో సినీపెద్దగా వ్యవహరించిన ఆ బడా హీరో ఎంతో గౌరవంగా ఎదుటి వారిని `గారు` అని ప్రస్థావించడం చర్చకు వచ్చింది. ఎక్కడా ఎదుటివారిపై దూషణలకు దిగకుండా ఈ లేఖలో `గారు` అని ప్రస్థావిస్తూ రాయడమే తనను అవమానించిన సహచరుడికి ఆయన ఇచ్చిన రివర్స్ పంచ్.
ఒకరు పరిణతితో మాట్లాడటానికి, ఒకరు నోరు జారడానికి మధ్య తేడా ఏమిటన్నది ఈ ఇన్సిడెంట్ స్పష్ఠంగా అందరికీ నేర్పిస్తుంది. అగౌరవంగా మాట తూలడం ఈయన శైలి అయితే.. గౌరవంగా ఒదిగి ఉండటం ఈయన శైలి! అంటూ ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా ఉన్న ప్రజలే మాట్లాడుకోవడం పై ఆసక్తికర చర్చ సాగుతోంది. అలా ఒదిగి ఉండకపోతే, బతిమాలుకోకపోతే ఆరోజు ప్రభుత్వం కారణంగా పెద్ద సినిమాలకు టికెట్ రేట్లు పెరిగేవి కావు! అనేది కూడా ఇండస్ట్రీ ప్రజలకు స్పష్ఠంగా తెలుసు. ఇక వేదికపై సహచరుడిని అనాలని కాదు కానీ, ఆయన మాట తీరే అంత! అని నోరు జారిన హీరో గురించి ఆలోచించే మంచి మనసు ప్రజలకు ఉంది.