ఇలియానా డి క్రూజ్.. పరిచయం అవసరం లేదు. సౌత్ నార్త్ లో స్టార్ గా ఓ వెలుగు వెలిగిన ఈ బ్యూటీ ఇటీవల విదేశీ ప్రియుడిని పెళ్లాడి, ఇద్దరు పిల్లలకు మమ్మీ గా బాధ్యతల్ని నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలి ఇంటర్వ్యూలో తన కెరీర్ - లైఫ్ జర్నీ గురించి ఆసక్తికర విషయాలను ముచ్చటించింది. వాటిలో ఒక ప్రముఖ దర్శకుడితో తన ఘర్షణ గురించి రివీల్ చేసింది. సెట్లో అతడు తిట్టిన తిట్లకు ఏడ్చేసానని, దాదాపు సెట్స్ ని వదిలేసి వెళ్లిపోయానని తెలిపింది.
ఎన్డీటీవీతో ఇంటర్వ్యూలో నాటి త్రోబ్యాక్ ఘటన గురించి గుర్తు చేసుకుంది. ఆరోజు సెట్స్ కి చాలా ఆనందంగా ఉత్సాహంగా వెళ్లాను.. అతడిని పలకరించాను. కానీ బ్యాడ్ మూడ్ లో ఉన్నాడు. వెంటనే తిట్టేసాడు. దాదా అలా చేసేప్పటికి నేను ఆల్మోస్ట్ ఏడ్చేసాను.. నా నిర్మాతకు కాల్ చేసాను అని కూడా ఇలియానా తెలిపింది.
చివరికి నేను నా పని నచ్చకపోతే చెప్పండి వెళ్లిపోతాను అని కూడా అనురాగ్ కి చెప్పానని వెల్లడించింది. అయితే అన్ని కష్టాలను అధిగమించి చివరికి ఇలియానాతో సమస్యను పరిష్కరించుకుని అనురాగ్ సినిమాని పూర్తి చేసాడు. బర్ఫీలో రణబీర్ కపూర్, ఇలియానా, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఆశించినంతగా బాక్సాఫీస్ వసూళ్లను సాధించకపోయినా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. జాతీయ అవార్డును కూడా గెలుచుకోవడం నటీనటులు, దర్శకనిర్మాతల గౌరవాన్ని పెంచింది.