బాలీవుడ్ లో చాలా మంది సెలబ్రిటీల జీవితాలు ఒక సినిమా కథను మించిపోతున్నాయి. కండల హీరో సల్మాన్ ఖాన్ లైఫ్ జర్నీ మొత్తం ఒక సినిమా కథకు తక్కువేమీ కాదు. అతడు అడవిలో కృష్ణ జింకల్ని వేటాడిన పాపానికి జీవితాంతం బిష్ణోయ్ తెగతో వైరానికి బలైపోవాల్సిన పరిస్థితి తలెత్తింది. కొన్ని నెలల క్రితం సల్మాన్ ఖాన్ స్నేహితుడు, ఎమ్మెల్యే బాబా సిద్ధిఖ్ ని గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ అనుచరులు దారుణంగా కాల్చి చంపిన సంగతి తెలిసిందే. సల్మాన్ ఖాన్ ఇంటిపై పలు రౌండ్లు కాల్పులు జరిపిన అనంతరం ఈ ఘటన పెను సంచలనంగా మారింది. సల్మాన్, అతడి కుటుంబీకులను బిష్ణోయ్ గ్యాంగ్ నిరంతరం బెదిరిస్తూనే ఉంది. హత్యా బెదిరింపులతో అతడు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
ఇప్పుడు బాలీవుడ్ నటి దిశా పటానీ బరేళి (యూపి) ఇంట్లో కాల్పుల ఘటన సంచలనంగా మారింది. దీనికి గ్యాంగ్ స్టర్ గోల్డీ బ్రార్ గ్రూప్ బాధ్యత వహించింది. గ్యాంగ్ స్టర్ అనుచరుల్లో ఇద్దరు ఈ పని చేసింది తామేనని ప్రకటించారు. తమ మత గురువులు ప్రేమానంద్ మహారాజ్, అనిరుధ్ మహారాజ్ లను కించపరుస్తూ దిశా పటానీ మాట్లాడిందని, తమ గురువుల గురించి తప్పుగా మాట్లాడినా హిందూ సమాజాన్ని తప్పుగా చూపించినా సహించబోమని హెచ్చరించారు.
ఈ ఘటనపై దిశా పటానీ తండ్రి జగదీష్ పటానీ మాట్లాడుతూ.. తెల్లవారు ఝామున ఇద్దరు దుండగులు బైక్ పై వచ్చి తమ ఇంటిపై కాల్పులు జరిపారని తెలిపారు. 8-10 రౌండ్లు కాల్పులు జరిగాయి. ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. దుండగులను పట్టుకుంటారు.. అని తెలిపారు. జగదీష్ పటానీ రిటైర్డ్ పోలీసాఫీసర్. ప్రస్తుతం ఆయన ఇంటి ముందు అదనపు భద్రతను పెంచారు.