కోలీవుడ్ పవర్ స్టార్ విజయ్ సినిమాలు వదిలి పూర్తిగా రాజకీయాల్లోకి వెళ్లిపోతున్న సంగతి తెలిసిందే. జననాయగన్ అతడు నటించిన చివరి సినిమా. షూటింగ్ పార్ట్ ముగించి విజయ్ తన రాజకీయ పార్టీ `తమిళగ వేట్రి కజగమ్`ని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నాడు. ఓవైపు తళా అజిత్ సినిమాలు వదిలి పూర్తిగా రేసింగుల వైపు మొగ్గు చూపుతుంటే, మరోవైపు దళపతి విజయ్ రాజకీయంగా బిజీ అయిపోవడం అభిమానులను నిరాశపరుస్తోంది.
అయితే సినీరంగంలోకి ప్రవేశించే ఆ ఇద్దరి వారసులు ఎవరు? అన్నది సస్పెన్స్ గా ఉంది. అజిత్ కుమారుడు ఆద్విక్ కుమార్ ఇంకా 10 ఏళ్ల బాలకుడు. అందువల్ల అతడు ఇంకో 10ఏళ్లు దాటే వరకూ సినిమా హీరోగా అడుగుపెట్టేందుకు ఛాన్స్ లేదు. అయితే దళపతి విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ వయసు 25. ఇప్పుడు అతడు నేరుగా సినీహీరోగా ఆరంగేట్రం చేసేందుకు అవకాశం ఉంది. కానీ ఇప్పటివరకూ జాసన్ ఏమవుతాడో క్లారిటీ ఇవ్వలేదు.
అతడు తండ్రి లెగసీని ముందుకు నడిపించేందుకు హీరో అవుతాడా? లేక భిన్నమైన కెరీర్ ని ఎంచుకుంటాడా? అనేదానిపై దళపతి విజయ్ క్లారిటీ ఇవ్వలేదు. ఇకపోతే జాసన్ ఒడ్డు పొడుగు అందంలో తండ్రిని మించిన వాడు. ఇంతకుముందు దర్శకుడు శంకర్ కుమార్తె అతిథి శంకర్ పెళ్లిలో అతడు ఆరడుగుల ఆజానుభాహుడిలా అందరినీ ఆకట్టుకున్నాడు. సినిమాల్లోకి వస్తే రాణించేందుకు ఆస్కారం ఉంది. తన తండ్రి సినిమాలను వదిలేస్తుంటే జాసన్ ఏం ఆలోచిస్తున్నాడో తెలియాల్సి ఉంది.