తీవ్రమైన ఆర్థిక నేరాలకు పాల్పడిన ప్రముఖులకు దేశం విడిచి పారిపోయే అవకాశం లేకుండా దారులు మూసేయడాన్ని `లుకౌట్ నోటీస్` పంపడం అంటారు. అలాంటి ఒక నోటీస్ అందుకుంది శిల్పాశెట్టి - రాజ్ కుంద్రా జంట. ఇకపై ఈ జంట విదేశాలకు పయనమైనా విమానాశ్రయంలో ఆపేస్తారు. ఇమ్మిగ్రేషన్ అధికారుల ప్రశ్నల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.
అయితే ఈ పరిస్థితి రావడానికి కారణమేమిటి? అంటే... రూ.60 కోట్ల మోసం కేసులో శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాపై పాత కేసు ఒకటి ఇంకా ముగియలేదు. ఈ కేసు 2015లో అక్షయ్ కుమార్ తో కలిసి ప్రారంభించిన బెస్ట్ డీల్ టీవీకి సంబంధించినది. ఈ సంస్థ లైఫ్ స్టైల్, ఆరోగ్యం, ఫ్యాషన్, అందంలో గ్లో పెంచే ఉత్పత్తులను విక్రయించింది.
అయితే ఈ కంపెనీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఒక బకరాను కూడా ఉపయోగించుకున్నారు. నెలవారీ రాబడి, అసలు చెల్లింపును హామీ ఇచ్చి, రుణం ఇవ్వడానికి బదులుగా రూ.60.48 కోట్లను తమ కంపెనీలో `పెట్టుబడి`గా పెట్టాలని ఆ జంట తనను ఒప్పించారని, కానీ తరువాత నిధులను తిరిగి ఇవ్వలేదని వ్యాపారవేత్త దీపక్ కొఠారి ఆరోపించారు.
ఈ వివాద కాలంలోనే 2016లో శిల్పా శెట్టి డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. 2017లో బెస్ట్ డీల్ టీవీపై దివాలా చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో ఈ జంట బంగారం పథకంలో పెట్టుబడిదారుడిని మోసం చేసినట్లు మరో ఆరోపణను ఎదుర్కొన్నారు. సెప్టెంబర్ 5న ఆర్థిక నేరాల విభాగం వారు తరచుగా అంతర్జాతీయ ప్రయాణాలు చేస్తున్నారని పేర్కొంటూ లుకౌట్ నోటీసు జారీ చేసింది. కోట్లాది రూపాయల ఆర్థిక నేరాలకు సంబంధించి అభియోగాలు ఉన్నవారికి లుకౌట్ నోటీసులు పంపుతారన్నది తెలిసినదే.