తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా రాజకీయాల్లో బిజీగా ఉన్న ఉదయనిది స్టాలిన్ హీరోగా సినీనిర్మాతగా కొనసాగడంలో కొన్ని ఇబ్బందులున్నాయి. అతడు ఇటీవల సినీరంగంలో ఇనాక్టివ్ గా ఉన్నాడు. అంతేకాదు రెడ్ జియాంట్ బ్యానర్ లో వరసగా సినిమాలను నిర్మించిన ఉదయనిది ఇటీవల సినిమాల నిర్మాణం పరంగాను రేసులో వెనకబడ్డాడు.
కారణం ఏదైనా ఇప్పుడు ఉదయనిది వారసుడిని బరిలో దించుతున్నాడు. ప్రతిష్ఠాత్మక రెడ్ జియాంట్ బ్యానర్ బాధ్యతలు ఇప్పుడు ఆయన కుమారుడు ఇన్బన్ స్టాలిన్ తీసుకుంటున్నారు. అయితే హీరో కొడుకు హీరో అవ్వాలి.. నిర్మాతగా బాధ్యతలు అదనం. కానీ ఇన్బన్ స్టాలిన్ హీరో అవుతాడా లేదా? అన్నదానిపై ఎలాంటి క్లారిటీ రాలేదు. ప్రస్తుతానికి నిర్మాతగా బాధ్యతల్ని తీసుకుంటున్నాడు. ఇది కూడా పెద్ద బాధ్యత. అతడికి ఇంకా అనుభవం అవసరం.
రెడ్ జియాంట్ బ్యానర్ లో ఇప్పటికే పలు భారీ చిత్రాలు విడుదలైనా, అవేవీ లాభాల్ని తేలేదు. నష్టాలు ఎక్కువే. ఈ ఏడాది విడుదలైన రెండు సినిమాలు పెద్ద ఫ్లాపులయ్యాయి. కమల్ హాసన్ - శింబుతో థగ్ లైఫ్ రెడ్ జియాంట్ బ్యానర్ కి భారీ నష్టాల్ని మిగిల్చింది. అందువల్ల ఉదయనిది నిర్మాతగా కొంత నిరాశలో ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. వారసుడికి పగ్గాలు అప్పజెప్పారు కాబట్టి, ఇకపై వరుసగా సినిమాలు తెరకెక్కేందుకు అవకాశం ఉంది. ఇన్బన్ స్టాలిన్ చూస్తుంటే చాక్లెట్ బోయ్ లా స్మార్ట్ గా ఉన్నాడు కాబట్టి హీరోగా రాణించేందుకు ఆస్కారం ఉంది. అయితే అతడు హీరో ఎప్పుడు అవుతాడో అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది.