తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ నటించిన `మదరాసి` తెలుగులోను విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఏ.ఆర్.మురుగదాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న శివకార్తికేయన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ``8ప్యాక్ కోసం స్టెరాయిడ్లు వాడారు`` అనే పుకార్లపై స్పందిస్తూ ఇలా సమాధానమిచ్చారు.
యూట్యూబ్ థంబ్‌నెయిల్స్‌లో తన గురించి అలాంటి పుకార్లు రావడం చూసానని శివకార్తికేయన్ అన్నారు. అయితే ఇదంతా `అమరన్`తో మొదలైంది. ``అమరన్ చిత్రం కోసం నేను మొదట సిక్స్ ప్యాక్‌లు చేసానని యూట్యూబర్లు చెప్పారు. వీళ్లు నా ముఖంతో ఒక నకిలీ ఫోటోని క్రియేట్ చేసి 8-ప్యాక్ చేసానని కూడా చెప్పారు. నన్ను చూడండి.. నా దగ్గర ఒక్క ప్యాక్ కూడా లేదు.. నేను బాడీ బిల్డింగ్ చేసానంతే!`` అని అన్నారు. యూట్యూబర్లు నా ముఖాన్ని పెద్దదిగా చేసి బూతద్దంలో చూపించి, నేను ఆరోగ్యాన్ని కోల్పోయానని చెప్పారు. ఇది అక్కడితో ఆగలేదు. ఇటీవల పుకార్లు కొత్త మలుపు తీసుకున్నాయి. మార్ఫింగ్ లో నా ముఖాన్ని పెద్దదిగా చేశారు.. స్టెరాయిడ్‌లను ఉపయోగించాడు అని రాసారు. కాబట్టి అతడు ఆరోగ్యాన్ని కోల్పోయాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడో చూడండి.. అయ్యయ్యో!! అని కూడా ఆవేదన చెందుతూ కథనాలు వేసారు.. అని సరదాగా నవ్వేస్తూ తనపై సాగిన ప్రచారం గురించి చెప్పుకొచ్చారు శివకార్తికేయన్.
బ్లాక్ బస్టర్ `అమరన్` చిత్రంలో శివకార్తికేయన్ దివంగత మేజర్ ముకుంద్ వరదరాజన్ పాత్ర పోషించాడు. ఈ పాత్ర కోసం అతడి మేకోవర్ చర్చనీయాంశమైంది. అమరన్ అతడి కెరీర్ బెస్ట్ హిట్స్ లో ఒకటి. రెమో, డాక్టర్, డాన్ వంటి చిత్రాలతో శివకార్తికేయన్ తనదైన ముద్ర వేసినా కానీ, `అమరన్` గేమ్ ఛేంజర్ అని చెప్పాలి. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 333 కోట్లు వసూళ్లతో కెరీర్ బెస్ట్ గా నిలిచింది. ఇప్పుడు మురుగదాస్ తో `మదరాసి` చిత్రంలో మానసిక రుగ్మతతో బాధపడుతున్న పాత్రను పోషిస్తున్నాడని గుసగుసలు ఉన్నాయి. తదుపరి రవి మోహన్, అథర్వ, శ్రీలీల కలిసి సుధ కొంగర `పరాశక్తి`లోను శివకార్తికేయన్ కనిపిస్తారు.