ఓవైపు ప్రజలు థియేటర్ల వైపు రావడం లేదనే ఆందోళన పరిశ్రమ వర్గాల్లో ఉంది. ప్రజల్ని థియేటర్లకు రప్పించడం ఇప్పుడు అంత సులువు కాదు. ఓటీటీ- డిజిటల్ మీడియా కంటెంట్ కారణంగా పెద్దతెరకు ప్రాధాన్యతలు మారిపోయాయి. భారీతనం నిండిన సినిమాలు చూడటానికి లేదా కొత్తదనం, వెరైటీ ఉన్న సినిమాలను వీక్షించేందుకు మాత్రమే ప్రజలు థియేటర్లకు వస్తున్నారు.
ఇలాంటి సమయంలో భారతీయ సినిమాలు వైవిధ్యం, భారీతనం ఉన్న హాలీవుడ్ సినిమాలతో పోటీపడాల్సి వస్తోంది. అత్యంత భారీ బడ్జెట్లతో టెక్నికల్ బ్రిలియన్సీతో రూపొందుతున్న కొన్ని హాలీవుడ్ చిత్రాలు భారతీయ మార్కెట్లో అజమాయిషీ చెలాయిస్తున్నాయి. పోటీలో లోకల్ సినిమాలు వెనకబడుతున్నాయి. ఇటీవలే విడుదలైన హాలీవుడ్ ఫ్రాంఛైజీ చిత్రాలు ఫైనల్ డెస్టినేషన్, మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ సినిమాలు భారతదేశం నుంచి భారీ వసూళ్లను కొల్లగొట్టాయి.
ఇప్పుడు కాంజురింగ్ ఫ్రాంఛైజీ నుంచి కొత్త సినిమా బాక్సాఫీస్ వద్ద హవా సాగిస్తోంది. ఈ శుక్రవారం విడుదలకు రాబోతున్న భారతీయ సినిమాలు ది బెంగాళ్ ఫైల్స్, భాఘి 4 చిత్రాలకు ఇది తీవ్రమైన పోటీనిస్తోంది. కాంజురింగ్ సిరీస్ కి భారతదేశంలో భారీ ఫాలోయింగ్ ఉంది. హారర్ జానర్ లో ప్రత్యేకమైన ఐడెంటిటీ ఉన్న సిరీస్. అందువల్ల టికెట్ల బుకింగ్ లో తుఫాన్ మొదలైంది. బుకింగులు ఓపెనయ్యాక ఇప్పటివరకూ 35000 టికెట్లు అమ్ముడయ్యాయని ఎగ్జిబిటర్లు చెబుతున్నారు. తీవ్రమైన రక్తపాతం, హింసతో వస్తున్న దేశీ యాక్షన్ చిత్రం `భాఘి 4` టికెట్లు కేవలం 7500 వరకూ అమ్ముడయ్యాయని తెలుస్తోంది.
ది బెంగాళ్ ఫైల్స్ చివరి నిమిషం వరకూ రిలీజవుతుందో లేదో తెలీని గందరగోళంలో ఉండటంతో ముందస్తు బుకింగులపై ఆ ప్రభావం పడింది. వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన ఈ చిత్రం బెంగాళ్ విభజన, ముస్లింలీగ్ ఉద్యమం, హిందూ మారణహోమం వంటి వివాదాస్పద కాన్సెప్టులతో రూపొందింది. అందువల్ల ఈ సినిమాని పశ్చిమ బెంగాళ్ లో విడుదల కానివ్వకుండా తృణమూల్ కాంగ్రెస్ ఆపుతోందని అగ్నిహోత్రి ఆరోపించారు. మునుముందు హాలీవుడ్ నుంచి భారీ బడ్జెట్ సూపర్ హీరో సినిమాలు రిలీజ్ కి వస్తున్నాయి. అవతార్ సహా పలు క్రేజీ ఫ్రాంఛైజీ చిత్రాలు దూసుకొస్తున్నాయి. ఇవన్నీ భారత్ నుంచి 100 కోట్లు అంతకుమించి దోచుకుపోవడం గ్యారెంటీ.