వివేక్ రంజన్ అగ్నిహోత్రి పరిచయం అవసరం లేదు. వరుసగా నిజ కథల్ని రాజకీయ శక్తులను ఎదుర్కొంటూ, మొండి ధైర్యంతో వెండితెరకెక్కిస్తున్న ఈ దర్శకుడు ఏదో ఒక రూపంలో వివాదాల్లోకి వస్తున్నాడు. స్వాతంత్య్రానికి పూర్వం బెంగాళ్ విభజన నేపథ్యంలో హిందూ ప్రజల దారుణ మారణ కాండపై అగ్నిహోత్రి ఓ రియలిస్టిక్ చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.
భారతీయ సినీపరిశ్రమలో అద్భుతమైన పరిశోధనతో కూడిన రాజీలేని సత్యాన్ని చెప్పే కథలతో ఆకర్షిస్తున్న అగ్నిహోత్రి గతంలో ది తాష్కెంట్ ఫైల్స్, ది కాశ్మీర్ ఫైల్స్ వంటి ప్రభావవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. ది బెంగాల్ ఫైల్స్‌తో భారతదేశ చరిత్రలో మరో భయంకరమైన మారణ హోమాన్ని వెండితెరపై ఆవిష్కరించనున్నారు. ఈ కథ కూడా అతడి ఇతర కథల్లానే వివాదాస్పదమైనది. ఇప్పటికే పశ్చిమ బెంగాళ్ లో రాజకీయ అల్లర్లు మొదలయ్యాయి. అగ్నిహోత్రిపై దాదాపు డజను పైగా కేసులు ఫైల్ అయ్యాయి. ఊపిరి సలపనన్ని వివాదాల్లోకి అతడిని లాగుతున్నారు.
స్థానిక టిఎంసి నాయకులు `ది బెంగాల్ ఫైల్స్` సినిమాని రిలీజ్ కానివ్వకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి కక్ష పూరిత వాతావరణంలో అగ్నిహోత్రి తాను ప్రకటించిన విడుదల తేదీ(సెప్టెంబర్ 5)కి ఈ సినిమా వస్తుందా లేదా? అన్నది సస్పెన్స్ గా మారింది. మరో ఐదు రోజుల్లోనే.. విడుదల తేదీ దగ్గర పడుతుండగా ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌లో హిందూ మారణహోమం గురించి నిజాన్ని బహిర్గతం చేసే షాకింగ్ వీడియోను విడుదల చేస్తూ ``కొన్ని శక్తులు సినిమాను నిషేధించాలనుకుంటున్నాయి`` అని అగ్నిహోత్రి ఆవేదనను వ్యక్తం చేసారు.
ఈ సినిమా నిడివి 204 నిమిషాలు. అంటే దాదాపు 3 గంటల 24 నిమిషాల నిడివితో ఉంటుంది. ఇది రణబీర్ కపూర్ నటించిన యానిమల్ సినిమా కంటే ఒక నిమిషం ఎక్కువ నిడివి ఉన్న సినిమా అని తెలుస్తోంది. సెప్టెంబర్ 5న విడుదల కావాల్సి ఉండగా, సీబీఎఫ్‌సి క్లియరెన్స్ రాకపోవడంతో సస్పెన్స్ నెలకొంది. సీబీఎఫ్‌సి పరీక్షా కమిటీ సర్టిఫికేషన్ కోసం ఈ సినిమాను క్లియర్ చేయడానికి నిరాకరించడంతో రివైజింగ్ కమిటీకి పంపారు. రివైజింగ్ కమిటీ ఈ మూవీలో కొన్ని మార్పులను సూచించింది. ట్రాన్స్‌జెండర్లపై ధిక్కారపూరిత పదాన్ని వేరొక పదంతో భర్తీ చేయాలని కోరింది. చాలా మంది పాపులర్ ఫేస్‌లను కూడా తొలగించాలని సూచించింది.
ది బెంగాల్ ఫైల్స్‌ను వివేక్ రంజన్ అగ్నిహోత్రి రాశారు. అభిషేక్ అగర్వాల్- పల్లవి జోషి నిర్మించారు. ఇందులో మిథున్ చక్రవర్తి, పల్లవి జోషి, అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్ నటించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 5, 2025న థియేటర్లలోకి వస్తుంది.