తెలుగు చిత్రపరిశ్రమలో సహాయ నటుడిగా, కమెడియన్‌గా ఓ వెలుగు వెలిగిన సుధాకర్ చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. తనతో పాటు కెరీర్ ప్రారంభించిన చాలా మంది హీరోలు ఇప్పుడు అగ్ర హీరోలుగా కొనసాగుతున్నా సుధాకర్ మాత్రం అనారోగ్య కారణాలతో పరిశ్రమకు దూరమయ్యారు. ఆయన ఆల్కహాలిక్ అని, దాని కారణంగానే తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని కథనాలొచ్చాయి.
సుధాకర్ దాదాపు 30 నెలల పాటు కోమాలో ఉన్నారు. కానీ ఇప్పుడు అన్నిటి నుంచి కోలుకుని తిరిగి మామూలు మనిషిగా ఆనందంగా జీవితాన్ని గడుపుతున్నారు. ఈ విషయాన్ని ఆయన తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. అంతేకాదు తన కుమారుడు బెన్నీ త్వరలో నటనలోకి ఎంట్రీ ఇస్తున్నారని, వారసుడు నటుడిగా రాణిస్తే, తనకు ఆర్థికపరమైన సమస్యలు కూడా ఉండవని సుధాకర్ అన్నారు.
నిజానికి నటుడిగా ఆయన చాలా సంపాదించారు.. చెన్నైలో 500కోట్లు పైగా ఆస్తులున్నాయని ప్రచారమైంది. కానీ అవన్నీ నిజాలు కాదని సుధాకర్ అన్నారు. అలాగే ఆర్థికంగా చితికిపోయారని వచ్చిన కథనాలను కూడా ఖండించారు. దివాళా అంచుకు ఎప్పుడూ వెళ్లలేదని, ఆర్థికంగా క్షీణ దశ ఉన్నా కానీ, మరీ కింది స్థాయికి పడిపోలేదని ఈ ఇంటర్వ్యూలో నటుడు సుధాకర్ కుమారుడు బెన్నీ తెలిపారు. ఒడిదుడుకులు ఎదుర్కొన్నా చితికిపోయామన్న ప్రచారం సరి కాదు! అని అన్నారు. సినీపరిశ్రమలో నటవారసులు కొనసాగుతున్న ఈ తరుణంలో బెన్నీ కూడా నటుడుగా అడుగుపెట్టనున్నాడని సుధాకర్ ధృవీకరించారు.